ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫ్రాంచైజీలకు ఇచ్చిన గడువు మరొకొద్ది గంటల్లో ముగియనుంది.అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని బీసీసీఐ ఫ్రాంచైజీలను ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం(అక్టోబర్ 31) సాయంత్ర 5 గంటల నుంచి రిటెన్షన్ జాబితాలను అధికారిక బ్రాడ్‌కాస్టర్స్, స్టార్ స్పోర్ట్స్, జియోసినిమా ప్రత్యేక ప్రోగ్రామ్స్‌తో ప్రకటించనున్నాయి.మరోవైపు ప్రతీ జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అనామక ఆటగాళ్లకు మాత్రమే తీసుకోవాలని పేర్కొంది. ఈ ఆరుగురి ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో తిరిగి తీసుకోవచ్చు.
ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకోవాలంటే ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 10 ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. స్టార్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ ఆండ్రీ రస్సెల్‌ను కేకేఆర్ వేలంలోకి వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఐపీఎల్ 2014 సీజన్ నుంచి 36 ఏళ్ల ఆండ్రీ రస్సెల్ కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కేకేఆర్ సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్‌ను కేకేఆర్ గెలవడం వెనుక కూడా ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. బ్యాట్, బంతితో అసాధారణ ప్రదర్శన కనబర్చి కేకేఆర్‌కు ముచ్చటగా మూడో టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే సామర్థ్యం రస్సెల్‌కు ఉంది. 10 ఏళ్ల పాటు కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన రస్సెల్.. వేలంలోకి వస్తే మాత్రం ఇతర ఫ్రాంచైజీలు కూడా ఎగబడనున్నాయి. రస్సెల్‌కు బదులు కేకేఆర్.. టీమిండియా యువ ఆటగాళ్లు రింకూ సింగ్, హర్షిత్ రాణాలను రిటైన్ చేసుకోనుంది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కూడా వదులుకునేందుకు కేకేఆర్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అతనితో ఫ్రాంచైజీ చర్చలు జరుపుతోందని వార్తలు వచ్చినా.. జట్టులో నుంచి బయటకు వచ్చేందుకే శ్రేయస్ అయ్యర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 మినీవేలంలో రికార్డ్ ధర రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్‌ను కూడా వేలంలో విడిచిపెట్టేందుకు కేకేఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
అతను మరింత తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉందని భావించి వేలంలోకి వదిలేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే అతన్ని ఆర్‌టీఎమ్ కార్డ్ కింద తిరిగి కొనుగోలు చేయవచ్చు.
కేకేఆర్ రిటెన్షన్ లిస్ట్(అంచనా)
సునీల్ నరైన్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా