కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విండీస్ పేస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఆ జట్టు కెప్టెన్ షాయ్ హోప్‌పై అలకబూని మ్యాచ్ మధ్యలో మైదానం విడిచి వెళ్లిపోయాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. మూడో ఓవర్ బౌలింగ్ చేసిన తర్వాత.. కెప్టెన్ మీద కోపంతో మైదానం వదిలి వెళ్లిపోయాడు. ఫీల్డింగ్ విషయంలో కెప్టెన్ హోప్, బౌలర్ జోసెఫ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మూడో ఓవర్‌ను మెయిడెన్ గా వేసినా... కెప్టెన్ మీద ఆగ్రహంతో జోసెఫ్ ఇలా మైదానం వదిలి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఫీల్డింగ్‌ను సెట్ చేయడంలో సారథి హోప్ నిర్ణయాలను జోసెఫ్ తప్పుపట్టాడు. అలా మ్యాచ్ మధ్యలో మైదానం విడిచిన అతడు ఓ ఓవర్ పాటు నిరసన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో పది మంది ఆటగాళ్లు మాత్రమే విండీస్‌కు ఫీల్డింగ్ చేశారు. ఒక ఓవర్ తర్వాత జోసెఫ్ మళ్లీ మైదానంలోకి దిగి జట్టుతో చేరాడు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ఇక నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్‌లో కరేబియన్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను విండీస్ 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కీసీ కార్టీ, బ్రాండన్ కింగ్‌లు శతకాలు బాదడంతో పాటు రెండో వికెట్‌కు 209 పరుగుల రికార్డుస్థాయి భాగస్వామ్యం అందించారు. దీంతో విండీస్ మరో ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ విధించిన 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.