ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ.. అది ముగియగానే ఈ నెల 24, 25 తేదీల్లో కీలక సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2024, 09:40 PM

నవంబరు 24, 25 తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. నవంబరు 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా.. ఇవి ముగిసిన తర్వాత కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్టు తొలివారంలో మొదటి కలెక్టర్ల సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చర్చించి, తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పురోగతి వివరించేలా నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. గడిచిన నాలుగు నెలల్లోశాఖల వారీగా నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.


కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి సమావేశంలో లెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. అధికార దర్పాన్ని పక్కనబెట్టి సామాన్యులకు దగ్గర కావాలని సీఎం సూచించారు. ఎమ్మెల్యేలూ, మంత్రులకూ ఇదే ఉద్బోద చేశారు. ‘మా ప్రభుత్వ విధానం, లక్ష్యాలు ఇవి. మీరు వినూత్నంగా ఆలోచించండి. మనసుపెట్టి పని చేయండి. ఫలితాలు సాధించండి’ అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు అందరి పనితీరు సమీక్షిస్తానని చంద్రబాబు చెప్పారు.


ఆగస్టు 5న జరిగిన కలెక్టర్ల మొదటి సమావేశాన్ని తొలుత రెండు రోజులు పాటు నిర్వహించాలని భావించారు. కానీ, చివరకు ఒక్క రోజేలో సీఎం ముగించారు. ఈ సమావేశంలో పలు శాఖలకు చెందిన అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ... రెవెన్యూ రికార్డుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అసైన్డ్‌, చుక్కల భూములు, ప్రీహోల్డ్‌ అంశం, రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలు, అసైన్డ్‌ భూముల పరాధీనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపైఆయన వివరాలను వెల్లడించారు. అనుమానాస్పద రిజిస్ట్రేషన్లపై కలెక్టర్లు విచారణ జరిపించాలని, రెవెన్యూ కార్యాలయాల్లో భూ రికార్డులు భద్రపరచాలని ఆయన సూచించారు.


మరోవైపు, ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాల ప్రారంభించాలని ఈ మేరకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరుతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ముగియనున్న నేపథ్యంలో తొలి రోజే 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. సమావేశాలను ఎన్ని రోజుల నిర్వహించాలనేది స్పీకర్‌ అయన్నపాత్రుడి అధ్యక్షతన జరిగే సభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ)లో నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఇవి 11 రోజులపాటు జరిగే వీలుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com