ఖలీస్థానీ ఉగ్రవాది, హర్దీప్ సింగ్ నిజ్జర్ ముఖ్య అనుచురుడు అర్షదీప్ దల్లాను కెనడాలో అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, అతడ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వదిలిపెట్టారా? లేదా జైల్లో ఉన్నాడా? అనేది సమాచారం లేదని పేర్కొన్నాయి. అయితే, అర్ష్‌దీప్ దల్లా అరెస్ట్‌పై అధికారికంగా ఎటువంటి ధ్రువీకరించలేదు. కెనడాతో అన్ని రకాల దౌత్య ఛానెల్స్‌ను భారత్ సస్పెండ్ చేయడంతో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సమాచార మార్పిడి నిలిచిపోయింది. కాగా, అక్టోబరు 27-28 తేదీల్లో కెనడాలోని మిల్టన్ పట్టణంలో జరిగిన కాల్పుల తర్వాత దల్లాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది, ఈ సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది.
కాల్పులు జరుగుతోన్న ప్రాంతంలో దల్లా ఉన్నట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. కాగా, భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న తరుణంలో దల్లాను అదుపులోకి తీసుకున్నట్టు వార్తల రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాలోనూ దల్లా పేరు కూడా ఉంది. మిల్టన్ పట్టణంలో ఖలిస్థానీ తీవ్రవాదులు కాల్పులు జరిపిన ఘటన వెనుక అర్ష్ దల్లా ఉన్నాడని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఘటనపై ప్రస్తుతం హాల్టన్ రీజినల్ పోలీస్ సర్వీసు దర్యాప్తు కొనసాగిస్తోంది. దల్లా అరెస్టు విషయంలో కెనడా, భారత నిఘా వర్గాలు సమన్వయంతో పనిచేసినట్టు తెలుస్తోంది.
గత నాలుగేళ్లుగా తన భార్యతో కలిసి కెనడాలో ఉంటున్న అర్ష్‌దీప్ దల్లా.. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ అనే తీవ్రవాద సంస్థ బాధ్యతలను హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య తర్వాత చేపట్టాడు. ఈ ఏడాది సెప్టెంబరులో పంజాబ్‌లోని మోగా జిల్లాలో కాంగ్రెస్ నేత బల్జిందర్ సింగ్ బల్లి హత్యకు దల్లా బాధ్యత వహిస్తూ ప్రకటన చేశాడు. తన తల్లిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి కారకుడని, అందువల్లే బల్జిందర్ సింగ్ బల్లిని హత్య చేయించానని అతడు చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది.
కాగా, గతేడాది పంజాబ్ పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌తో అతడికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గత నెల సిక్కు కార్యకర్త గురుప్రీత్ సింగ్ హత్య వెనుక కూడా దల్లా హస్తం ఉన్నట్టు గుర్తించారు. గురుప్రీత్ సింగ్ హరి నౌ అలియాస్ భోడి అక్టోబర్ 9న తన ద్విచక్ర వాహనంపై గురుద్వారా నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కాల్చి చంపారు.ఈ హత్యకు అర్ష్ దల్లా,ఇతర వ్యక్తులు విదేశాల నుంచి ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. విదేశాల్లో ఉన్న వేర్వేరు హ్యాండ్లర్‌లతో హత్యకు పథకం, దాన్ని అమలు చేయడానికి వేర్వేరు మాడ్యూల్స్ ఉపయోగించినట్టు తేలింది.