ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, ఈ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా కాంగ్రెస్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని సంజయ్ సింగ్ ఆరోపించారు.కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన హద్దులు దాటి తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం 24 గంటల్లో అజయ్ మాకెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను తప్పించేందుకు ఇతర పార్టీలతో మాట్లాడతామన్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ స్పందించారు.2013లో 40 రోజుల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మద్దతివ్వడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద పొరపాటు అని, అందువల్లే ఢిల్లీలో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. తమ పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకోవాలన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ, శాంతిభద్రతలు సహా వివిధ సమస్యల పరిష్కారంలో బీజేపీ (కేంద్రం), ఆమ్ ఆద్మీ ప్రభుత్వం విఫలమయ్యాయని కూడా ఆరోపించారు.