ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మగాళ్లకు సరికొత్త ‘బెంగ’.. ‘ఆడ’ సమస్య.. ఈడ మరింత జఠిలం.. డాక్టర్ల విస్మయం!

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 10:43 PM

మహిళలతో పోలిస్తే పురుషుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్లు తక్కువ. శారీరక అనుకూలతల రీత్యా.. పురుషులు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడటమనేది అరుదుగా జరుగుతుంది. కానీ గత కొద్ది నెలలుగా బెంగళూరు నగరంలో యూరిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతోన్న పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మూత్రంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, జ్వరం లాంటి లక్షణాలతో చాలా మంది పురుషులు తమను సంప్రదిస్తున్నారని బెంగళూరు డాక్టర్లు చెబుతున్నారు.


పురుషుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్లు పెరగడానికి.. సాధారణం కంటే ఎక్కువసార్లు లైంగిక చర్యలో పాల్గొనడం, పరాయి వ్యక్తులతో శృంగారం జరపడం లాంటి జీవనశైలి మార్పులు ప్రధాన కారణమని ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్లో యూరాలజీ అధిపతిగా పని చేస్తోన్న డాక్టర్ గోకులకృష్ణన్ అభిప్రాయపడ్డారు. సురక్షితం కాని శృంగారం, పురుషాంగం ముందు భాగంలో ఉండే చర్మానికి సంబంధించిన సమస్యల్లాంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్లని ఆయన తెలిపారు. నగరాల్లో నివసించే వారిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం, లైఫ్‌స్టైల్ కారణంగా రోగనిరోధకశక్తి తగ్గడం, డాక్టర్ల సలహా తీసుకోకుండా యాంటీబయోటిక్స్‌ను ఇష్టారీతిన వాడటం లాంటి కారణాల వల్ల శరీరం ఇన్ఫెక్షన్లకు తేలిగ్గా లొంగుతుందని డాక్టర్ గోకులకృష్ణన్ తెలిపారు.


‘‘మహిళల్లో వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్లను యాంటీ బయోటిక్స్‌ మాత్రలతో తగ్గించొచ్చు. కానీ పరుషుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్లు క్లిష్టంగా ఉంటాయి. వీరికి ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడొచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ల వల్ల పురుషులకు యాంటీబయాటిక్స్ ఇంజెక్ట్ చేయాల్సి రావొచ్చు లేదంటే ఆసుపత్రిలో చేరాల్సి కూడా రావొచ్చ’’ని డాక్టర్ గోకులకృష్ణన్ చెప్పారు.


‘‘శరీర నిర్మాణ సంబంధమైన తేడాల వల్ల మహిళలతో పోలిస్తే పురుషులకు యూరిన్ ఇన్ఫెక్షన్ల తక్కువగా వస్తాయి. మగవారిలో మూత్ర వ్యవస్థలో పొడవాటి మూత్రాశయం ఉండటం వల్ల బ్యాక్టీరియా మూత్రాశయంలోకి చేరుకోవడం కష్టతరం అవుతుంది. దీంతో పురుషుల్లో మూత్ర సంబంధిత అంటువ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత లాంటి బాహ్య కారకాలు మహిళలు యూరిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండే విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ పురుషుల్లో మాత్రం నీరు సరిపడా తాగకపోవడం, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం తినడం లాంటి కారణాలు యూరిన్ ఇన్ఫెక్షన్లు పెరగడానికి కారణం అవుతున్నాయి’’ అని డాక్టర్ దీపక్ చెప్పుకొచ్చారు.


పురుషుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన కేసులు గతంలో నెలకు ఒకటి వచ్చేవని.. కానీ ఇప్పుడు వారానికి పది కేసులు వస్తున్నాయని మణిపాల్ హాస్పిటల్‌లో యూరాలజీ హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ దీపక్ దూబే తెలిపారు. యూటీఐ కేసులు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయన్న దూబే.. మంచినీళ్లు సరిపడా తాగకపోవడం ముఖ్య కారణమన్నారు. నీళ్లు తగినన్ని తాగితే బ్యాక్టీరియా మూత్రనాళం నుంచి బయటకు వెళ్లిపోయి మూత్రవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్ దీపక్ తెలిపారు.


‘‘ఐదేళ్ల క్రితం నెలకు ఒకటి రెండు కేసులు వచ్చేవి. ఇప్పుడు నెలకు కనీసం 18 కేసులు వస్తున్నాయి. డయాబెటిస్, ఇమ్యూనిటీ బలహీనంగా ఉండటం మొదలైనవి.. పురుషుల్లో యూటీఐ లాంటి ఇన్ఫెక్షన్లు పెరగడానికి దోహదం చేస్తున్నాయి’’ అని ఆల్టియస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్, ఆండ్రాలజిస్ట్ అయిన డాక్టర్ బి రమేశ్ తెలిపారు.


నీళ్లు ఎక్కువగా తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, శృంగారంలో పాల్గొన్న తర్వాత మూత్రవిసర్జన చేయడం, ఫోర్ స్కిన్ పురుషాంగానికి అతుక్కుపోవడం లాంటి ఇతర ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా పురుషులు యూరిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవచ్చు. చాలా మంది యూరిన్ బ్లాడర్ నిండినప్పటికీ.. పనిలో పడి మూత్రవిసర్జనకు వెళ్లకుండా ఆపుకుంటారు. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com