వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ విరుచుకుపడ్డారు. శాసనసభలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఉగ్రవాది గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు నానా కష్టాలు పడుతున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా పిలవాలో కూడా తెలియడం లేదన్నారు. దేనికీ సరైన లెక్కలు లేవని, అంకెల గారడీతో గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ అరాచకం జరిగిందని పేర్కొన్నారు.ప్రభుత్వ వైఖరితో ఎంతోమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని పయ్యావుల ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభల అనుమతి లేకుండా రూ. 634 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ చెప్పిందని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు. చంద్రబాబు వచ్చాక మళ్లీ వస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి విధ్వంసం, విశాఖ భూ దోపిడీ మీ అరాచకం కాదా? అని వైసీపీని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కనపెట్టిందని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆపేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారణమయ్యారని నిప్పులు చెరిగారు. సూట్‌కేసు కంపెనీలు, బ్రీఫ్‌కేస్ కంపెనీలు, క్విడ్ ప్రో కో పదాలను ప్రజలకు పరిచయం చేశారని పయ్యావుల ఎద్దేవా చేశారు.