పాడి రైతులకు విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) తీపికబురు చెప్పింది. పాల సేకరణ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది.. ఈ వివరాలను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు వెల్లడించారు. 10 శాతం వెన్న కలిగిన గేదె పాల సేకరణ ధర లీటరుకు రూ.2 పెంచగా.. ఆవు పాలకు రూ.1.50 పెంచారు. ప్రస్తుతం 10శాతం వెన్న కలిగిన పాలు లీటర్ రూ.80 చెల్లిస్తుండగా.. తాజాగా రూ.2 పెంచడంతో రూ.82 అయ్యింది. నాలుగు నెలలకు రెండో విడత బోనస్ కింద రూ.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదికి మూడు విడతలుగా బోనస్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఆర్థిక లాభం లెక్కలు వేసుకుని బోనస్‌లు ప్రకటిస్తున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచుతున్నట్లు చెప్పారు. గ్రామీణ యువత కూడా పాడి పరిశ్రవైపు ఆసక్తిని పెంచేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ఎలాంటి సంక్షోభాలు వచ్చినా సరే రైతులకు సాయం చేయడానికి కృష్ణామిల్క్ యూనియన్ ముందుంటుంది అన్నారు. వినియోగదారుడి నుంచి తీసుకున్న డబ్బుల్లో 82శాతం పాడి రైతులకు ఇస్తున్నామన్నారు. ఇటీవల వరదల సమయంలో పాలఉత్పత్తి ఆగకుండా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్ పాలక మండలి సమష్టి కృషితో ఈ మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
కృష్ణా మిల్క్ యూనియన్ పై సోషల్ మీడియాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు చలసాని ఆంజనేయులు. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. కృష్ణా మిల్క్ యూనియన్ దేశంలో ఆదర్శవంతమైన డెయిరీగా అభివర్ణించారు. తమతో పోటీ పడలేక హేమా హేమీ సంస్థలు వెనుకబడిపోయాయన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ మాత్రమే సంపాదనలో మూడు సార్లు రేటు, బోనస్ ఇస్తుందన్నారు. ఇప్పటికే రైతులకు బోనస్‌తో కలిపి లీటరుకు సుమారు రూ.91లు వరకు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ధరల్ని మరింతగా పెంచుతామని చెప్పారు. మొత్తానికి విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) పాల సేకరణ ధరను పెంచడంతో రైతులు ఆనందంలో ఉన్నారు.