బంగాళాఖాతంలో అల్పపీడనాల సీజన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు అల్పపీడనాలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు మంచి వర్షాలనిచ్చాయి. తాజాగా, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఈ నెల 21 నాటికి దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా బలపడుతుందని ఏపీఎస్డీఎంఏ వివరించింది. అంతేకాకుండా, ఆ తర్వాత 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావం ఏపీపై ఉంటుందని... నవంబరు 27, 28 తేదీల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనులకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది.