ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్‌లో చల్లారని మంటలు.. ప్రభుత్వానికి మైతీల 24 గంటల డెడ్‌లైన్

national |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 10:12 PM

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. మరోసారి జాతుల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గతవారం జిరిబామ్‌ జిల్లాలో మైతీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా ఆరుగుర్ని అపహరించి.. అత్యంత పాశవికంగా హత్య చేశారు. వీరి శవాలు నదిలో గుర్తించారు. అయితే, దీని వెనుక కుకీ మిలిటెంట్ల హస్తం ఉన్నట్టు అనుమానించడంతో రాష్ట్రంలో అల్లర్లు రాజుకున్నాయి. హత్యాకాండకు నిరసనగా మైతీలు ఆందోళనలు చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడిచేసి, నిప్పంటించారు. సీఎం బీరేన్ సింగ్ నివాసానికీ నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితులు బీరెన్‌ సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మిత్రపక్షం ఎన్పీపీ సైతం మద్దతు ఉపసంహరించింది.


 ఈ క్రమంలో మణిపూర్‌ పరిణామాలపై చర్చించడానికి సీఎం బీరేన్‌ సింగ్‌ సోమవారం సాయంత్రం మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలపై సమీక్షించిన ఈ భేటికి 11 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి కారణాలు వెల్లడించకుండానే డుమ్మాకొట్టారు. మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని మళ్లీ అమలు చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని, జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ మిలిటెంట్లకు వ్యతిరేకంగా వారం రోజుల్లోగా భారీ ఆపరేషన్ చేయాలని తీర్మానించారు. అయితే, ఈ హత్య కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ కి అప్పగించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు.. జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ తీవ్రవాదులను చట్టవిరుద్ధమైన సంస్థ’ సభ్యులుగా ప్రకటించేందుకు అంగీకరించారు.


పై తీర్మానాలను నిర్ణీత వ్యవధిలోగా అమలు చేయకుంటే ఎన్డీయే ఎమ్మెల్యేలంతా రాష్ట్ర ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని సీఎం ఆఫీస్ విడుదల చేసిన తీర్మానం పేర్కొంది. కాగా, ఈ తీర్మానాలను మైతీ పౌర సమాజ సంస్థలు తిరస్కరించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల సమావేశం కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూశామని కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆన్‌ మణిపూర్‌ ఇంటిగ్రిటీ (కొకొన్) అధికార ప్రతినిధి ఖురైజం అథౌబా అన్నారు.


‘ఈ తీర్మానాలతో మణిపూర్‌ ప్రజలు సంతృప్తి చెందలేదు.. జిరిబామ్‌లో అమాయక మహిళలు, చిన్నారులను చంపిన కుకీ మిలిటెంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.. కానీ ఇది కేవలం జిరిబామ్‌కే పరిమితం కాలేదు.. మే 2023 నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో జరుగుతున్నాయి.. కాబట్టి కుకీ మిలిటెంట్ల చెందిన గ్రూపులపై (SoO) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను మణిపూర్ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు’ అని ఆయన తెలిపారు.


అన్ని SoO సమూహాలను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించాలని, కుకీ తిరుగుబాటుదారుల కార్యకలాపాల సస్పెన్షన్‌ ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేయాలని మైతీ పౌర సమాజ సంఘం డిమాండ్ చేసింది. ‘ప్రభుత్వం లేదా ఎమ్మెల్యేలు మళ్లీ ప్రజలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదు.. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది.. రాబోయే 24 గంటల్లో ప్రభుత్వం ఈ తీర్మానాన్ని సమీక్షించి మరో తీర్మానంతో తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం.. వారు అలా చేయకపోతే మా ఆందోళనను తీవ్రతరం చేస్తాం. ఇందులో భాగంగా ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తాం’ కొకొమి ప్రతినిధి హెచ్చరించారు.


కుకి మిలిటెంట్ సమూహాలు SoO, కేంద్రం మధ్య కార్యకలాపాల సస్పెన్షన్ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం.. తిరుగుబాటుదారులు నిర్దేశిత శిబిరాల్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే వారి ఆయుధాలను ఓ ప్రాంతంలో నిల్వ చేసి వీటిని సైన్యం, కుకీ మిలిటెంట్లు సంయుక్తంగా పర్యవేక్షిస్తుంటారు. అయితే,. ఫిబ్రవరిలో SoO గడువు ముగిసింది. పునరుద్దరణపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటించలేదు. అయితే, నవంబర్ 11న 10 మంది కుకీ మిలిటెంట్ల ఎన్‌కౌంటర్ SoO ఒప్పందం పునరుద్ధరణ జరగలేదని సూచిస్తుందని వర్గాలు తెలిపాయి.


మరోవైపు, మణిపూర్‌లో పరిస్థితులపై కేంద్రం అప్రమత్తమయ్యింది.ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హింసను అదుపుచేసి, శాంతి నెలకొనేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. గతేడాది మే నుంచి మైతీ, కుకీ వర్గాల మధ్య జరుగుతోన్న హింసాకాండలో ఇప్పటి వరకు 220 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com