మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది. రాఘవేంద్రస్వామికి ఇష్టమైన గురువారం పర్వదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో మంత్రాలయం పురవీధులన్నీ కిటకిటలాడాయి. బుధవారం రాత్రి నుంచే భక్తుల రాక ప్రారంభం కావడంతో శ్రీమఠం అతిథి గృహాలన్ని నిండిపోయాయి.
దీంతో ప్రైవేటు లాడ్జిల యజమానులు ధరలకు రెక్కలు వచ్చాయి. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు లాడ్జిల యజమానులు భక్తుల నుంచి గంటకు ఒక రేటు నిర్ణయించి నిలువుదోపిడీ చేశారు. ఆర్టీసీ బస్టాండు, రాఘవేంద్రసర్కిల్, మధ్వమార్గ్ కారిడార్, తుంగభద్ర నదితీరం, శ్రీమఠం ప్రాంగణం, అన్నపూర్ణ భోజనశాల ప్రాంతాలన్నీ భక్తులు పోటెత్తారు. గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. పరిమళ ప్రసాదం వద్ద సందడిగా మారింది. ప్రసాదం కోసం శ్రీమఠం అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.