పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ హయాంలో కేంద్రం నుంచి విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులను సైతం దారి మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేసింది. కేంద్ర ఇచ్చే నిధులను నేరుగా పంచాయతీ ఖాతాలకు జమ చేస్తామని, పల్లెలో ప్రగతి పనులు చేపటడతామని, పంచాయతీలను ఆర్ధికంగా బలోపేతం చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రెండో విడత ఆర్థిక సంఘం నిధులను పంచాయతీ ఖాతాలకు జమ చేసింది. తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్ధిక సంఘం నిధులు మొదటి విడతగా పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలోని పంచాయతీలకు రూ.70.04 కోట్లు విడుదలయ్యాయి.
పంచాయతీలకు అన్‌టైడ్ కింద రూ.28.21 కోట్లు, టైడ్ గ్రాంటు కింద రూ.41.82 కోట్లు విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని జనాభా ప్రాతిపదికన పంచాయతీల ఖాతాల్లో నిధులు జమ చేశారు. వైసీపీ పాలనలో ఐదేళ్లలో లేని విధంగా పంచాయతీలకు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండటంతో పంచాయతీల పాలకవర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఒకదాని వెంట విడుదల చేస్తుండటంతో గ్రామాల్లో సమస్యలు తీరనున్నాయి. టైడ్ నిధులను ఓడీఎఫ్ నిర్వహణ, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, తాగు నీటి సరఫరా, రహదారులు వంటి పనులకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ నిధులను నిబంధనల మేరకు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఆర్ధిక సంఘం నిధులు విడుదలైన ప్రతిసారీ పంచాయతీల విద్యుత బకాయిలకు కొంత మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది. అదే తరహాలో ఇప్పుడూ అన్‌టైడ్ గ్రాంటుగా విడుదల చేసిన రూ.28.21 కోట్లలో పది శాతం విద్యుత బకాయిలకు ఖచ్చితంగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో పది శాతం నిధులను ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణకు, 20 శాతం నిధులను కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాలు, కంప్యూటర్ల కొనుగోలు, స్టేషనరి ఇతర సామగ్రి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. పాఠశాల భవనాల మరమ్మతులు, తాగునీటి వసతి, ఆట స్థలాల అభివృద్ధి వంటి పనులు ఖర్చు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.