ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రసాదరెడ్డి గడిచిన ఐదేళ్లలో సాగించిన అడ్డగోలు వ్యవహారాలపై విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీ అవినీతి, అక్రమాలకు కేంద్ర బిందువు మారిందని, దీనికి ప్రసాదరెడ్డే కారణమని పేర్కొన్నారు. వర్సిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెనేట్ హాల్‌లో రాజకీయ నాయకుల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారని, జీవీఎంసీ ఎన్నికల్లో అధికార వైసీపీ తరపున అభ్యర్థులను వర్సిటీలో కూర్చుని ఆయనే ఎంపిక చేశారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కాలేజీల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించారని, వీటన్నింటిపై విచారణ నిర్వహించాలని స్పీకర్‌ను పల్లా కోరారు. అలాగే పాస్టర్‌గా ఉన్న లెక్చరర్‌ను వర్సిటీకి తీసుకువచ్చి రిజిస్ర్టార్‌గా బాధ్యతలను అప్పగించారన్నారు.
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారిని గైడ్లుగా పెట్టి సీనియర్ ప్రొఫెసర్లను అవమానించారన్నారు. రూసా పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. ఏయూలో రెగ్యులర్ ప్రొఫెసర్లను పక్కనపెట్టి ఎయిడెడ్ కాలేజీల నుంచి లెక్చరర్లను తెచ్చి ప్రొఫెసర్లుగా నియమించి సొంత సైన్యాన్ని తయారుచేసుకున్నారని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో వర్సిటీని ఆయన భ్రష్టుపట్టించిన తీరుపై పత్రికలు కథనాలు ప్రచురించాయన్న పల్లా శ్రీనివాసరావు...ఆ వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వర్సిటీకి సంబంధించిన కీలక దస్ర్తాలను మాయం చేశారని, వీటన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.