మచిలీపట్నంలో స్టేడియం నిర్మించి తీరుతామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. గత మూడు రోజులుగా జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 38వ బాక్సింగ్ పోటీలు గురువారం రాత్రి ముగిసాయి. ఈ సందర్భంగా బహుమతి ప్రదానోత్సవ సభలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి పాలకులు మచిలీపట్నంలో స్టేడియం నిర్మాణానికి అడుగడుగునా అడ్డు తగిలారన్నారు. కేంద్ర నిధులతో రెండేళ్లలో మచిలీపట్నంలో స్టేడియం నిర్మించి తీరుతామన్నారు.
విద్యార్థుల చదువు, క్రీడలకు తగిన ప్రాధాన్యతను కూటమి ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ, క్రీడల వల్ల మానసిక, శారీరక వికాసం కలుగుతుందన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ, క్రీడాకారులకు తనవంతు సాయం అందిస్తామన్నారు. ఎన్నారై సతీష్ మాట్లాడుతూ, చైనా కన్నా భారతదేశ జనాభా పెరిగిందని, అయితే చైనాతో పాటు అంతర్జాతీయ క్రీడల్లో భారతదేశం పోటీ పడలేకపోతున్నదన్నారు. ఒలింపిక్ క్రీడల్లో భారతీయులు పోటీ పడేందుకు బాల్యం నుంచి శిక్షణ అవసరమన్నారు. డీఈవో రామారావు మాట్లాడుతూ, మూడు రోజులుగా రాష్ట్రంలోని 500 మంది క్రీడాకారులకు భోజన వసతి సదుపాయాలు కల్పించడంలో జాగ్రత్త వహించిన వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. కృష్ణాజిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు టి.అజయ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి డి.శ్రీనివాసరావు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, జాతీయ క్రీడాకారిణి రమ్య తదితరులు పాల్గొన్నారు.