చిట్టీల మోసం ఉత్తరాంధ్రలో పెద్దఎత్తున కలకలం రేపుతుంది. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురంలో చోటు చేసుకుంది. జిల్లాలో అనధికార చిట్టీల మోసాలు నిత్యం ఎక్కడో ఒక చోట కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరికి వారే దొరికినకాడికి దోచుకొని పరారవుతున్నారు. అనధికార చిట్టీల మోసాల బారిన పడి చిరు, మధ్యతరగతి ప్రజలు మోసపోతున్నా పోలీసులు వాటిని అరికట్టడంలో విఫలమవుతూనే ఉన్నారు. చిట్టీల నిర్వాహకులు విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. చిట్టీల నిర్వాహకులు అనధికార చిట్టీల వ్యాపారం చేస్తున్నారని పోలీసులకు తెలిసినా ముందస్తు చర్యలు చేపట్టకపోవడం మోసాలకు కారణంగా తెలుస్తుంది.
ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చిన చిట్టీల మోసం కలకలం రేపుతుంది. భోగాపురంకి చెందిన తిరుమరెడ్డి మురళీ అనే ఓ వడ్డీ వ్యాపారి చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడి సుమారు యాభై కోట్ల మేర కాజేసి పరారయ్యాడు. మురళీ గత ఇరవై ఏళ్లుగా వడ్డీలు, చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. మొదట్లో పది మందితో ప్రారంభమైన చిట్టీల వ్యాపారం తక్కువ సమయంలోనే భారీ ఎత్తుకు చేరుకుంది. మురళీ అందరితో కలిసిమెలిసి ఉంటూ నమ్మకంగా వ్యవహరిస్తూ తన అక్రమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించాడు. ఇతని కస్టమర్లలలో చిన్నకారు రైతుల నుండి వ్యాపారులు, ఉద్యోగులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మొదట్లో నిబంధనల ప్రకారం సమయానికి కస్టమర్లకు డబ్బులు తిరిగి చెల్లించేవాడు. దీంతో ఇతని పై నమ్మకం కూడా బాగానే పెరిగింది.