ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరును మొబైల్ యాప్‌లో తీసుకోనున్నారు. అటెండెన్స్ మొబైల్ యాప్ ఇప్పటికే అందుబాటులో ఉండగా.. ఇకపై రోజుకు రెండుసార్లు హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. వార్డు సచివాలయానికి వచ్చిన సమయంలో చెక్ ఇన్.. అలాగే విధులు ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో చెక్ అవుట్ నమోదు చేయాల్సి ఉంటుంది. సచివాలయానికి వచ్చిన సమయం.. అలాగే వెళ్లిన సమయం రెండింటినీ నమోదు చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారులు స్పష్టం చేశారు. అలాగే హాజరు నమోదు సమయంలో రెండింటిని ఒకేసారి నమోదు చేస్తే ఆరోజును సెలవుగా పరిగణిస్తామంటూ హెచ్చరించారు. ఈ విషయమై ఉద్యోగులకు సందేశాలు పంపించినట్లు తెలిసింది.
అయితే గతంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు విధానం వేరే విధంగా ఉండేది. సచివాలయానికి వచ్చినప్పుడు లేదా.. వెళ్లేటప్పుడు ఒక్కసారి అటెండెన్స్ మొబైల్ యాప్‌లో హాజరు నమోదు చేసుకుంటే సరిపోయేది. అయితే ఈ విధానంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని గమనించిన అధికారులు.. ఇప్పుడు రెండు సమయాల్లోనూ హాజరు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాకాకుండా ఒకేసారి నమోదు చేసినా, ఒకే ఎంట్రీ ఉన్నా కూడా ఆ రోజును సెలవుగా పరిగణిస్తామని తెలిపారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది క్రమం తప్పకుండా గుర్తుంచుకుని మరీ హాజరు వేయాలి. లేకపోతే పనిచేసినప్పటికీ ఆ రోజు సెలవుగా మారిపోతుంది మరి.
మరోవైపు సామాజిక భద్రతా పింఛన్లను కూడా ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే పంపిణీ చేస్తున్నారు. గతంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగేది. అయితే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని మార్చింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారానే ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేయిస్తున్నారు. ఒకే రోజులో పింఛన్లను పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు గ్రామాల్లోని సచివాలయాలను పంచాయితీలతో అనుసంధానం చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.