అవినీతి ఆరోపణల కేసులో అరెస్టైన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు సెప్టెంబరులో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన మర్నాడే ఆయనను మళ్లీ ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలో తీసుకోవడంపై సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి ఆరోపణలు కేసులో అరెస్టైన వ్యక్తి మంత్రివర్గంలో చేరడం.. సాక్షులు ఒత్తిడికి గురవుతారనే అభిప్రాయం ఎవరికైనా వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనం.. ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఆయన బెయిల్ రద్దుకు నిరాకరించింది. బెయిల్ ఉత్తర్వులు ఇతరులకు ప్రయోజనం చేకూర్చాయని, కాబట్టి మెరిట్‌లపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది.
బాలాజీకి వ్యతిరేకంగా సాక్ష్యం చేప్పేవారు ఒత్తిడికి గురవుతున్నారా? లేదా? అనే దానిపై పిటిషన్ పరిధిని పరిమితం చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ‘మేము బెయిల్ ఇచ్చిన మర్నాడే మీరు మంత్రి అయ్యారు.. సీనియర్ క్యాబినెట్ మంత్రిగా ఉండటంతో సాక్షులు ప్రభావితం అవుతారనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది.. ఏం జరుగుతోంది’ అని సెంథిల్ బాలాజీ తరఫున న్యాయవాదిని జస్టిస్ ఏఎస్ ఓకా ప్రశ్నించారు. అనంతరం తదుపరి విచారణకు డిసెంబరు 13కు వాయిదా వేసింది.
‘అవినీతి కేసులో రెండో నిందితుడైన సెంథిల్ బాలాజీ.. సెప్టెంబరు 26 నాటి మా ఉత్తర్వుల ద్వారా బెయిల్‌పై విడుదలైన మర్నాడే క్యాబినెట్ మంత్రిగా నియమితులయ్యారు... ఆయనపై వచ్చిన ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే సాక్షులు ఒత్తిడికి గురికావచ్చు... ఇది మాత్రమే మేము ప్రాథమికంగా పరిగణించాలనుకుంటున్నాం.. కానీ, యోగ్యతలకు సంబంధించి తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదు’ అని వ్యాఖ్యానించారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన సెంథిల్ బాలాజీ.. జయలలిత హయాంలో 2011 నుంచి 2015లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగ నియమాకాల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదుచేసింది. ఈ కేసులో గతేడాది జూన్‌లో ఆయనను అరెస్ట్ చేయగా.. 8 నెలల తర్వాత మంత్రిపదవికి బాలాజీ రాజీనామా చేశారు. 14 నెలలు జైల్లో ఉన్న ఆయనకు సెప్టెంబరు 26న సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైన వెంటనే స్టాలిన్ క్యాబినెట్‌లో మళ్లీ చేరారు. ప్రస్తుతం తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, ఈ కేసు వెనుక బీజేపీ కుట్ర ఉందని డీఎంకే ఆరోపణలు చేస్తోంది.