ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదటి పోస్టింగ్‌లో చేరడానికి వెళ్తుండగా ప్రమాదం.. యువ ఐపీఎస్ మృతి

national |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2024, 09:23 PM

విధిరాతను ఎవరూ తప్పించలేరేమో.. మనం ఒకటి తలస్తే.. దైవం మరొకటి తలుస్తుంది. ఎంతో కష్టపడి చదవి.. ఐపీఎస్ కావాలన్న తన కలను నెరవేర్చకున్న యువకుడు.. పోస్టింగ్‌లో చేరడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత విషాదకర ఈ ఘటన కర్ణాటకలోని హసన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన హర్ష్ బర్దన్ (26).. 2023 సివిల్స్‌లో కర్ణాటక క్యాడర్‌‌ ఐపీఎష్‌గా ఎంపికయ్యారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న హర్ష్‌కు తొలి పోస్టింగ్ హసన్ జిల్లాలో వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న పోలీసు వాహనం ప్రమాదానికి గురైంది.


టైరు పేలిపోవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లి ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో ముందు సీటులో ఉన్న బర్దన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తలకు బలమైన గాయం కాగా.. హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హర్ష్ వర్దన్ ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జయ్యింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఐపీఎస్ మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ఏళ్ల తరబడి కష్టానికి ప్రతిఫలం లభిస్తున్నప్పుడు ఇలా జరగడం బాధాకరం’ అని ఆయన బాధాతప్త హృదయంతో అన్నారు.


‘హసన్-మైసూరు జాతీయ రహదారి కిట్టనే సరిహద్దు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్ధన్ మృతి చెందడం విచారకరం... ఐపీఎస్ అధికారిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తుండగా ఇలాంటి ప్రమాదం జరగడం బాధాకరం... ఏళ్ల తరబడి శ్రమ ఫలిస్తున్న సమయంలో అలా జరగకూడదు.. హర్ష్ వర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ ’ అని ఎక్స్‌ (ట్విట్టర్)‌లో సిద్ధరామయ్య పోస్ట్ చేశారు.


మాజీ సీఎం సదానంద గౌడ ‘అంకితభావంతో కూడిన యువ అధికారిని భారతావని కోల్పోయింది’ అని విచారం వ్యక్తం చేశారు. హర్ష్ బర్దన్ హోలెనరసిపుర్‌ ప్రొబేషనరీ ఏఎస్పీగా డ్యూటీలో రిపోర్ట్ చేయడానికి హాసన్‌కు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే ఆయన మైసూరులోని కర్ణాటక పోలీస్ అకాడమీలో నాలుగు వారాల శిక్షణను పూర్తిచేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com