దేశంలో జనాభా వృద్ధి రేటు తగ్గుదలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణిస్తే సమాజమే అంతరించిపోతుందన్న ఆయన.. ప్రతి కుటుంబం కనీసం ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. నాగపూర్‌లో ఆదివారం నిర్వహించిన ‘కథాలే కుల్ సమ్మేళన్’లో మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత జనాభా విధానం పాతికేళ్ల కిందటదని, 1998లో లేదా 2002లో ఖరారు చేశారని చెప్పారు. జనాభా వృద్ధి రేటు 2.1కి తగ్గకూడదని అందులో స్పష్టంగా పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు.
‘సమాజంలో కుటుంబం ఓ భాగం. ప్రతి కుటుంబం ఓ యూనిట్.. జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం..సంస్కృతి, విలువలు వారసత్వంగా ఒక తరం నుంచి మరొక తరానికి అందుతాయి.. తద్వారా భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా శాశ్వతమైన ప్రధాన వ్యవస్థలు, విలువలు సంరక్షించుకోవచ్చు..
వృద్ధి రేటు 2.1కి తక్కువగా ఉంటే సమాజం అంతరించిపోతుంది... ఆ పరిస్థితుల్లో దానినెవరూ నాశనం చేయాల్సిన అవసరం లేదు.. తనంత తానే నాశనమవుతుంది.. భాషలూ కనుమరుగవుతాయి.. సంస్కృతీ నశిస్తుంది.. ప్రతి జంటా ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను.. కనీసం ముగ్గురిని కనాలి.. ఈ విషయాన్ని జనాభా శాస్త్రమే చెబుతోంది.. సమాజం మనుగడ సాగించాలంటే పిల్లల సంఖ్య ముఖ్యం’ అని భాగవత్ తెలిపారు.
జనాభా నియంత్రణ, మతపరమైన జనాభా ఈ రెండూ విస్మరించడానికి వీల్లేనివని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల దసరా ర్యాలీలో కూడా ఆయన జనాభా పెరుగుదల అవసరాన్ని నొక్కిచెప్పడం గమనార్హం. ప్రతి కోణంలో ఆలోచించి అన్ని వర్గాలకు వర్తించేలా నూతన జనాభా విధానాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. వివిధ వర్గాల జనాభాలో అసమతౌల్యం, భౌగోళిక సరిహద్దులనూ ప్రభావితం చేస్తుందని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
‘అధిక జనాభా వల్ల భారం ఎక్కువగా ఉంటుందన్నది నిజమే... కానీ జనాభాను సక్రమంగా వినియోగించుకుంటే అదో వనరుగా మారుతుంది.. 50 ఏళ్ల తర్వాత మన దేశం ఎంత మందికి ఆహారం అందించగలుగుతుందనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని భగవత్ అన్నారు. మహిళను తల్లిగా పరిగణించడం మంచిదేనని.. అయితే వారిని నాలుగు గోడలకే పరిమితం చేయడం మంచిది కాదని చెప్పారు.