యోగాలో ఉండే అనేక ఆసనాలు శారీరకంగా, మానసికంగా చాలా ప్రయోజనాలు అందిస్తాయి. చాలా సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాంటి ఆసనమే 'ఉత్తాన శీర్షాసనం'. ఇది శారీరక లాభాలతో పాటు మానసికంగానూ ప్రశాంతంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఒంట్లోని చాలా నొప్పులను ఈ ఆసనం తగ్గించగలదు. ఈ ఆసనాన్ని పప్పీ పోజ్‍కు పొడగింపు అని కూడా అంటారు. ఈ ఉత్తాన శీర్షాసనం వివరాలు ఇవే.
ఉత్తాన శీర్షాసనం వేసే విధానం
ఉత్తాన శీర్షాసనం వేసేందుకు.. ముందుగా ఓ చోట మోకాళ్లపై కూర్చోవాలి. ఆ తర్వాత ముందుకు అరచేతులను నేలకు అనించాలి.
ఆ సమయంలో నడుము, మోకాళ్లు సమాతరంగా ఉండాలి.
ఆ తర్వాత మోచేతులను వంచాలి. చేతులు మరింత ముందుకు జరిపి నేలకు ఆనించాలి. నడుమను మరింత పైకి తీసుకెళ్లాలి.
చేతులు నేలకు పూర్తిగా ఆనాక.. ఛాతిని కింద తాకేలా కిందికి బెండ్ చేయాలి. ఆ సమయంలోనే నడుమును మరింత పైకి వెళ్లేలా చేయాలి.
ఆ తర్వాత నుదురు కూడా నేలకు ఆనించాలి. ఈ భంగిమలో కొన్ని సెకన్ల పాటు ఉండాలి.
ఉత్తాన శీర్షాసనం ప్రయోజనాలు
నొప్పులు తగ్గేలా..: ఉత్తాన శీర్షాసనంలో శరీరంలోని చాలా అవయవాలు సాగదీతకు గురవుతాయి. చేతులు, కాళ్లు, మోకాళ్లు, భుజాలు, నడుము, వెన్ను, మెడ, ఛాతి సహా వివిధ అవయవాలపై ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల ఈ ఆసనం చేస్తే వాటిలో నొప్పి ఉంటే ఉపశమనం కలుగుతుంది. ఒంటి నొప్పులు తగ్గేలా చేయగలదు. ఈ ఆసనం చేస్తే శరీరం మొత్తం రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది.
నిద్ర పట్టేలా..: నిద్రలేమి సమస్య ఉన్న వారికి కూడా ఈ ఉత్తాన శీర్షాసనం మేలు చేస్తుంది. ఈ ఆసనం చేయడం వల్ల నిద్ర మెరుగ్గా పడుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది.
ఊపిరితిత్తులకు..: ఉత్తాన శీర్షాసనం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఛాతిని అదిమిపెట్టి ఆసనం చేయడం వల్ల ఊపిరితిత్తులు ఉత్తేజితమవుతాయి. ఈ ఆసనం వల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది: ఉత్తాన శీర్షాసనం వల్ల కండరాల్లోని ఒత్తిడి బాగా తగ్గుతుంది. రిలాక్స్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. నడుముకు కూడా చాలా మేలు చేస్తుంది. ఈ ఆసనం వేస్తే శరీరం విశ్రాంతిగా ఫీల్ అవుతుంది. మానసిక ఒత్తిడిని కూడా ఈ ఆసనం తగ్గించగలదు.
కడుపు సమస్యలు తగ్గేలా..: ఉత్తాన శీర్షాసనం వేసే సమయంలో నడుమును పైకి వెళ్లేలా చేయడంతో పొత్తి కడుపుపై ఒత్తిడి పడుతుంది. కడుపులోని అవయవాలకు మసాజ్ చేసినట్టు అవుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్యాస్, మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు తగ్గుతాయి.