కరోనా సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రజల ప్రాణాలను కాపాడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా వ్యాక్సిన్ కారణంగా తమ పిల్లలు మృతి చెందారంటూ ఇద్దరు మహిళల తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీవీ వరాలేతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. కొవిడ్-19 మహమ్మారి కనీవినీ ఎరగని విపత్తు అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ కారణంగా ప్రజల ప్రాణాలు నిలబడ్డాయన్నారు. వ్యాక్సినేషన్, దాని దుష్ప్రభావాల అంశాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే సమగ్రంగా పరిశీలించిందన్నారు.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి వివాదం లేదని, కానీ ఆ వ్యాక్సినేషన్ తర్వాతే వారు చనిపోయారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వీరి మృతిపై నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడం, పోస్టుమార్టం నివేదికను ఇవ్వడం, నిర్దేశించిన కాల వ్యవధిలో దర్యాఫ్తు పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్నసుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది.