ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్, దుమ్ము, కాలుష్యం కారణంగా మన జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా.. తెల్ల జుట్టు, తలపై వెంట్రుకలు రాలిపోవడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో ఖరీదైన షాంపూలు, కండిషనర్లు సీరమ్‌లు వాడుతుంటాం. మనం జుట్టు రాలిపోకుండా ఉండటం కోసం చాలా ఖర్చు చేస్తూంటాం. అయితే, మనం తీసుకునే చికిత్సలు చాలా కాలం తర్వాత జుట్టును పాడు చేస్తాయి. అంతేకాకుండా మీ జేబుకు చిల్లులు పడేలా చేస్తుంది.
అయితే, ఎటువంటి ఖర్చు లేకుండా.. కొన్ని సహజ పద్ధతుల ద్వారా జుట్టును సంరక్షించుకోవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలు.. జుట్టును పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని పోషకాలు అవసరం. పోషకాలు.. జుట్టుకు కావాల్సిన పోషణను అందిస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలిపోకుండా కంట్రోల్ చేస్తాయి. అలా జుట్టుకు తగిన పోషణ నిచ్చి, వెంట్రుకలు రాలిపోకుండా చేసే ఇంటి చిట్కా ఉంది. అదే లవంగం నూనె. లవంగం నూనెను ఎలా వాడితే జుట్టు బలంగా మారి రాలిపోకుండా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
లవంగం నూనె..
ఆయుర్వేదంలో లవంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లవంగాల్ని అనేక ఆరోగ్య సమస్యల్ని నయం చేయడానికి ఆయుర్వేద నిపుణులు ఉపయోగిస్తున్నారు. ఇక జుట్టు ఆరోగ్యం కోసం లవంగాల్ని ఎన్నో యేళ్లుగా వాడుతున్నారు. లవంగాలతో తయారు చేసిన నూనె వల్ల జుట్టు బలంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలిపోవడం సమస్యలు తగ్గి.. మెరుస్తుంది. జుట్టుకు కావాల్సిన పోషణ అందించడమే కాకుండా షైన్ కూడా అందిస్తుంది. లవంగాల నూనె వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు, అది ఎలా వాడాలో ఓ లుక్కేద్దాం.
జుట్టు మూలాలు బలపడతాయి..
లవంగాల నూనె పోషక గుణాలతో నిండి ఉంటుంది. ఇది బలహీనమైన జుట్టుకు చెక్ పెడుతుంది. ఈ నూనెలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు బలాన్ని పెంచుతాయి. జుట్టుకు తగిన పోషణనిచ్చి.. బలంగా మారుస్తుంది. లవంగం నూనె తేమను ఉత్పత్తి చేస్తుంది. దీంతో జుట్టు పెళుసు బడటం, పొడి బారడం జరగదు. దీంతో.. జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. రెగ్యులర్ వాడకంతో, జుట్టు బలంగా మారడంతో పాటు అస్సలు రాలిపోదు.
చుండ్రుతో పోరాడుతుంది..
లవంగం నూనె స్కాల్ప్ ఇరిటేషన్, చుండ్రు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు ఈస్ట్ పెరగకుండా నిరోధిస్తాయి. లవంగం నూనెను కొబ్బరినూనెతో మిక్స్ చేసి మాస్క్‌లా ముప్పై నిమిషాల పాటు ఉంచితే.. దీర్ఘకాలిక ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు పొడుగ్గా మారుతుంది..
లవంగం నూనెలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ ఫోలికల్స్‌కు పోషకాల పంపిణీని మెరుగుపరచడం ద్వారా, లవంగ నూనె బలమైన, పొడవాటి జుట్టును ప్రోత్సహిస్తుంది.
జుట్టు మెరుస్తుంది..
లవంగం నూనె స్కాల్ప్‌ను శుభ్రపరచడం, ఆకృతిని మెరుగుపరచడం ద్వారా నిస్తేజమైన జుట్టును పునరుజ్జీవింపజేస్తుంది. ఇది జిడ్డు, చుండ్రుతో పాటు మలినాలను తొలగిస్తుంది. దీంతో జుట్టు మెరుస్తుంది.
తెల్ల జుట్టుకు చెక్..
ఈ రోజుల్లో ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. లవంగం నూనెలో యూజినాల్ అనే సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది తెల్ల జుట్టుకు సహజ పరిష్కారాన్ని అందిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ గుణాలు హెయిర్ షాఫ్ట్, ఫోలికల్స్ ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది. సహజ రంగును మెరుగుపరుస్తుంది.
ఎలా ఉపయోగించాలి..
మీరు లవంగం నూనెను నేరుగా తలకు రాసుకోవచ్చు. లేదంటే కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవచ్చు. దీన్ని రాత్రిపూట జుట్టుకు పట్టించి, మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడువుగా మారుతుంది. జుట్టు రాలిపోయే సమస్య తగ్గిపోతుంది. కావాలంటే గోరు వెచ్చగా లవంగాల నూనెను తలకు అప్లై చేసుకోవచ్చు.
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.