కేరళలో దట్టమైన శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు.నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు.మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు నవంబర్ 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తోన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొల్లం వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ ఈ ప్రత్యేక రైళ్ల సంఖ్యనూ పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మరో 22 అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.స్వామి భక్తుల సౌకర్యం కోసం ట్రావెన్‌కూర్ దేవస్వొం బోర్డు మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో రద్దు చేసిన బంగారు లాకెట్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ సీజన్‌లో గోల్డ్ లాకెట్లను జారీ చేసేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఈ మధ్యాహ్నం జరగబోయే దేవస్వొం బోర్డు భేటీలో ఆమోదముద్ర వేయనుంది.
ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను జరుపుకొంటోన్న సందర్భాన్ని పురస్కరించుకుని దేవస్వొం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి బొమ్మను ముద్రించిన లాకెట్లు ఇవి. ఒక్కొక్కటి ఒక గ్రాము మొదలుకుని గరిష్ఠంగా ఎనిమిది గ్రాములు బరువు వరకు ఉంటుంది. వీటిని తయారు చేయడానికి 20 రోజుల సమయం పడుతుంది.మండలం- మకరవిలక్కు సీజన్ ముగియడానికి చివరి 10 రోజుల్లోగా ఈ లాకెట్లను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు చేపట్టామని, వీటిని తయారు చేయడానికి పలు జ్యువెలరీ సంస్థలు ముందుకు వచ్చాయని బోర్డు సభ్యుడు అజిత్ కుమార్ తెలిపారు. దీని ధర ఎంత అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని అన్నారు.1980లో తొలిసారిగా అయ్యప్ప స్వామి బంగారు లాకెట్లను వినియోగంలోకి తీసుకొచ్చారు అధికారులు. 2011- 2012 సీజన్ వరకూ అమ్మకాలు కొనసాగాయి. అదే చివరి సారి. ఆ తరువాత దీని విక్రయాలను నిలిపివేశారు. అప్పట్లో ఒక్కో గోల్డ్ ప్లేటెడ్ లాకెట్ 500 రూపాయలు. ఒకవైపు అయ్యప్ప స్వామి, మరో వైపు గణేషుడి బొమ్మలు ముద్రించివుండేవి.