ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మామిడి పంటకు వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ పీలేరు ఏడీ రమణరావు తెలిపారు. పీలే రు మండలం గూడరేవుపల్లె పం చాయతీ మర్రిమాకులపల్లె తాండా లో మంగళవారం వ్యవసాయ, ఉద్యాన శాఖ సంయుక్తంగా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ నెల 15వ తేదీలోపు ఎకరాకు రూ.2250ల ప్రీమియం చెల్లించి తమ పంటకు బీమా చేయించుకోవాలన్నారు. తమ దగ్గరలో ఉన్న బ్యాంకు, కామన సర్వీస్ సెంటర్ లేదా రైతులు నేరుగా పీఎంఎఫ్బీవై వెబ్సైట్ ద్వారా బీమా చేయించుకోవచ్చునన్నారు. అనంతరం ప్రస్తుత సీజనలో మామిడిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏవో రమాదేవి, హెచవో సుకుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.