బరువు తగ్గాలని అనుకునే వారికి ఆహారాల విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఫుడ్స్ విషయంలో కూడా ఒక్కోసారి ఆలోచించాల్సి వస్తుంది. క్యాలరీలు ఎక్కువ అవుతాయేమోనని డౌట్ ఉంటుంది. పన్నీర్, టోఫు విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. రెండింట్లోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. చూడడానికి కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే, బరువు తగ్గేందుకు ఏది ఎక్కువ ఉపయోగపడుతుందనేది మాత్రం సందేహం ఉంటుంది.
పన్నీర్, టోఫు మధ్య తేడాలు
ఆవు, గేదె, మేక పాలను నుంచి పన్నీర్ తయారవుతుంది. పాలను ప్రాసెస్ చేసి పన్నీర్ తయారు చేస్తారు. సోయా పాలతో టోఫు తయారవుతుంది. సోయా బీన్స్ ప్రాసెస్ చేయడం ద్వారా టోఫు రెడీ అవుతుంది.
పన్నీర్, టోఫులో పోషకాలు ఇలా..
పన్నీర్, టోఫులు దాదాపు ఒకే రకమైన పోషకాలను కలిగి ఉంటాయి. అయితే, లెక్కల్లో కాస్త తేడాలు ఉంటాయి. 100 గ్రాముల పన్నీర్‌లో సుమారు 18 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 270 క్యాలరీలు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువ ఉండటంతో కండలు పెరిగేందుకు పన్నీర్ ఎక్కువ సహకరిస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి.
100 గ్రాముల టోఫులో సుమారు 8 నుంచి 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. క్యాలరీలు 70 నుంచి 90 మాత్రమే ఉంటాయి. పన్నీర్‌తో పోలిస్తే ఐరన్, కాల్షియం, ఫైబర్ టోఫులో కాస్త ఎక్కువగా ఉంటాయి. కాల్షియం ఎక్కువ కావాలనుకునే వారికి టోఫు బెస్ట్ ఆప్షన్.
బరువు తగ్గేందుకు ఏదీ మేలు!
పన్నీర్, టోఫుల్లో ఆరోగ్యానికి ఏది మంచిది అంటే ఒక్కదాన్ని ఖరాఖండిగా చెప్పడం కష్టమే. ఈ రెండు ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తాయి. ప్రోటీన్ సహా ఇతర పోషకాలు ఇస్తాయి. ప్రోటీన్ ఎక్కువగా కావాలనే వారు పన్నీర్ ఎక్కువగా తీసుకోవచ్చు. క్యాలరీలు తక్కువగా ఉండాలంటే టోఫు తినడం బెస్ట్. పన్నీర్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ డైట్‍లో క్యాలరీ కౌంట్‍ను బట్టి పన్నీర్, టోఫులను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ బరువు తగ్గేందుకు కచ్చితంగా ఒకటి చెప్పాలంటే మాత్రం.. టోఫునే మేలు. ఎందుకంటే పన్నీర్‌తో పోలిస్తే టోఫులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ కూడా సరిపడా కలిగి ఉంటుంది. వెయిట్ లాస్‍కు టోఫు బెస్ట్. డైట్ విషయంలో సందేహాలు ఉంటే సంబంధిత నిపుణుల సలహా తీసుకోవచ్చు. ఇటీవలి కాలంలో టోఫు వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. పన్నీర్‌లాగానే చాలా వరకు సూపర్ మార్కెట్లు, షాప్‍ల్లో దొరుకుతోంది. టోఫు ప్లాంట్ బేస్డ్ కావడంతో వీగన్ డైట్ పాటిస్తున్న వారు కూడా తీసుకోవచ్చు. పన్నీర్.. డెయిరీ ప్రొడక్ట్ కావడంతో వీగన్లు తీసుకోరు.