2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములు అనేవి పార్టీలకు సర్వసాధారణం. కానీ ఏపీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం వైసీపీ నేతలను మానసికంగా కుంగిపోయేలా చేసింది. కార్యకర్తల్లో, నేతల్లో నూతనోత్తేజం నింపేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పార్టీ నేతలతో జిల్లాల వారీగా సమావేశమవుతూ పరిస్థితిని సమీక్షించారు. అయితే గురువారం ఊహించని విధంగా ఇద్దరు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆళ్ల నాని, సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, వాసిరెడ్డి పద్మ వంటి నేతలు వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపిస్తున్నట్లు చెప్పారు.
అయితే రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్ చెప్తున్న మాట ఒక్కటే. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఓ వైపు చెప్తూనే.. అధినేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇద్దరు నేతలు తప్పుబడుతున్నారు. ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలో వచ్చి ఆరు నెలలు గడుస్తోంది. అయితే ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకత మొదలైందని వైఎస్ జగన్ చెప్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలకు పిలుపునిచ్చారు, అందులో భాగంగా డిసెంబర్ 13న అన్నదాత సుఖీభవ చెల్లించాలంటూ రైతు సమస్యలపై పోరాటం చేయాలని వైసీపీ శ్రేణులకు సూచించారు. అలాగే డిసెంబర్ 27న కరెంటు ఛార్జీలపైన, జనవరి 3న ఫీజు రియింబర్స్‌మెంట్ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.
వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్ తప్పుబడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వైఎస్ జగన్ గౌరవించాలని.. ఐదేళ్లు పాలించాలని ప్రజలు అధికారమిస్తే ఐదు నెలలు కూడా పూర్తవకుండానే ఉద్యమాలు, ధర్నాలు ఏమిటని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. తాడేపల్లిలో కూర్చుని జగన్ ఆదేశాలిస్తారు కానీ.. క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఇబ్బందులు ఎవరికి తెలుస్తాయని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి కొన్నిరోజులు సమయం ఇవ్వకుండా ఇలా వ్యవహరించడం సరికాదని అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా ఇంచు మించుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేరని గతంలో వైఎస్ జగన్ చెప్పారని.. అయినా ప్రజలు చంద్రబాబుకు ఓట్లేసి గెలిపించారని అన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవనే విషయం వైఎస్ జగన్‍కు తెలిసి కూడా సూపర్ సిక్స్ పథకాల అమలుకు డిమాండ్ చేయడం సరికాదన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు సాధ్యం కాదని తెలిసీ.. వాటిపై ఉద్యమాలు, ఆందోళనలు చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని గ్రంధి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. మంచిపేరు రావాలనే ఉద్దేశంతో వైసీపీ హయాంలో అప్పులు తెచ్చి మరీ కార్యక్రమాలు అమలు చేశారని.. కానీ బిల్లులు చెల్లించలేదని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు.
దీంతో ప్రభుత్వ విధానాలపై వైఎస్ జగన్ ఆందోళనలకు పిలుపు ఇవ్వడం.. ఇద్దరు నేతలు రాజీనామా చేయడం ఇప్పుడు ఏపీలోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన నేతలు.. పార్టీ విధానాలను విమర్శించడం సరికాదని వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రభుత్వ నిర్ణయాలపైనా, ప్రజల తరుఫున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాయి.