అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడరాని పాట్లు పడుతున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్త్తున్నారు. వారు నేడు మాట్లాడుతూ..... ఏటా సీజన్‌కు ముందే అందే పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా అటకెక్కింది. పంటల బీమా పరిహారం జాడలేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితి నెలకొంది.ప్రభుత్వ తీరుపై అన్నదాతలు కన్నెర్ర చేస్తున్నారు. ఓవైపు విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆందోళన బాటపట్టారు. ఇటీవలే ధాన్యం రాశులతో మండల కేంద్రాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు డిమాండ్‌తో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.ఈ నేపథ్యంలో ఆర్నెల్ల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు అండగా వైయస్ఆర్‌సీపీ ఆందోళన బాటపట్టింది. ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట వైయస్ఆర్‌సీపీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సన్నద్దమవుతున్నారు.