గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని గోడౌన్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి రూ.3.5 కోట్ల విలువైన 155 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ముగ్గురు ప్రధాన స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ దుంగలను తిరుపతికి తీసుకొచ్చారు. కపిలతీర్థం వద్ద గల టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివా్‌సతో కలిసి జిల్లా ఎస్పీ, టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి ఎల్.సుబ్బరాయుడు మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘కొద్ది రోజుల కిందట అన్నమయ్య జిల్లా సానిపాయ వద్ద రాంప్రసాద్, రవిశంకర్ అనే స్మగ్లర్లను అరెస్ట్ చేశాం. వీరిని విచారించగా గుజరాత్‌కు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. వారి సమాచారంతో టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ ఎండీ షరీఫ్ బృందం, గుజరాత్ పోలీసుల సహకారంతో పటాన్‌లోని గోడౌన్లపై దాడిచేశారు. అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లయిన గుజరాత్‌లోని దీసా పట్టణానికి చెందిన ఉత్తమ్‌కుమార్ నందకిషోర్‌సోనీ, జోషి హన్స్‌రాజ్, పఠాన్ పట్టణానికి చెందిన పరేష్ జి కాంతిఠాకూర్‌ను అరెస్ట్ చేశాం. వీరు గోడౌన్లలో దాచి ఉంచిన ఐదు టన్నుల బరువైన 155 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నాం. ఒక కారుని సీజ్ చేశాం’ అని టాస్క్‌ఫోర్సు ఇన్‌చార్జి సుబ్బరాయుడు తెలిపారు. పట్టుబడ్డ వారిని అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్‌పై తిరుపతికి తీసుకొచ్చామన్నారు. ప్రధాన స్మగ్లర్లను అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు కొనసాగుతుందని, అవసరమైతే పట్టుబడ్డ వారిపై పీడీ, ఏసీటీ యాక్టులు ప్రయోగిస్తామన్నారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరచిన టాస్క్‌ఫోర్స్ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించి నగదు బహుమతి అందించారు. ఈ విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీఎస్పీలు జి.బాలిరెడ్డి, వి.శ్రీనివాసరెడ్డి, ఎండీ షరీఫ్, ఆర్‌ఐ సురే్‌షకుమార్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఎం.సురే్‌షకుమార్, ఎస్‌ఐ రఫీ తదితరులు పాల్గొన్నారు.