దివ్యాంగుల పట్ల సానుభూతిని చూపించడం కాదని వారిలో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించి వారికి భవిష్యత్‌ను ఇవ్వాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరం గేదెల నూకరాజు కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ సభకు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సామాజిక భద్రత పెన్షన్ కింద ఇంటి వద్దే రూ.6 వేలు ప్రతినెలా అందిస్తుందని.. పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి సోమవారం నిర్వ హించే పీజీఆర్‌ఎస్‌కు మెకనైజ్డ్ బ్యాటరీ ట్రైసైకిల్స్, ట్రైసైకిల్స్ ,దివ్యాంగుల చైర్స్ కోసం ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. జిల్లాలో దివ్యాంగుల కోసం పనిచేస్తున్న జియోన్,పలుకు, సంకల్పం ఫస్ట్, కన్నా వంటి సంస్థల భాగస్వామ్యం స్ఫూర్తిదాయకమన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గత ప్రభుత్వం జియోన్ సంస్థకు సంబంధించి దివ్యాంగుల ఆశ్రయాన్ని ఖాళీ చేయించడం అన్యాయమన్నారు.జిల్లా కలెక్టర్ వారికి తగు న్యాయం చేయాలని కోరారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ సమాజంలో విభిన్న ప్రతిభావంతుల కు సహకరించాలన్నారు. దివ్యాంగులకు అవ కాశం ఇస్తే ఏదైనా సాధిస్తారన్నారు. అనం తరం విభిన్న ప్రతిభావంతులను సత్కరించి జ్ఞాపిక అందించారు.కన్నా ఆశ్రయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ గండి శకుంతలాదేవిని కలెక్టర్ ప్రశాంతి,ఎమ్మెల్యేలు సత్కరించారు.తొలుత కన్నా ఫౌండేషన్, ధవళేశ్వరం పలుకు సంకల్ప పాఠశాల విద్యార్థుల నృత్య పదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో అఽధికారులు పాల్గొన్నారు.