బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ రికార్డులు బద్దలు కొట్టింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు స్టేడియానికి క్యూ కట్టారు. దీంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. దీంతో పలు రికార్డులను ఈ టెస్టు మ్యాచ్ బద్దలు కొట్టింది.
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌కు ఈ స్థాయిలో ప్రేక్షకులు రావడం ఇదే తొలిసారి. బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకుల పరంగా చూసినా.. ఈ టెస్టే అగ్రస్థానంలో ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు మ్యాచులు ముగిసే సరికి సిరీస్ 1-1తో సమమైంది. దీంతో నాలుగో మ్యాచులో ఎవరు గెలుస్తారు? అనే ఆసక్తితో ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న అనూహ్య మార్పులు కూడా ప్రేక్షకులను రప్పించేందుకు కారణమయ్యాయి. తొలుత ఆస్ట్రేలియా పైచేయి సాధించడం.. ఆ తర్వాత భారత్.. మళ్లీ ఆస్ట్రేలియా.. ఆ తర్వాత డ్రా దిశగా సాగడం.. చివరకు ఆస్ట్రేలియా గెలవడం ఈ టెస్టులో జరిగింది.
బాక్సింగ్ టెస్టు మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుల సంఖ్య..
తొలి రోజు: 87,242
రెండో రోజు: 85,147
మూడో రోజు: 83,073
నాలుగో రోజు: 43,867
ఐదో రోజు: 74,363
దీంతో ఈ టెస్టు మ్యాచ్‌కు మొత్తంగా 3,73,691 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఆస్ట్రేలియాలో ఓ టెస్టు మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. అంతకుముందు ఈ జాబితాలో మెల్‌బోర్న్‌లో 1937 యాషెస్ సందర్భంగా జరిగిన టెస్టు మ్యాచ్ ఉంది. డాన్ బ్రాడ్‌మన్ ఆట చూసేందుకు ఆ మ్యాచ్‌కు 3,50,534 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే ఆ టెస్టు మ్యాచ్ ఆరు రోజుల పాటు సాగింది. తాజాగా మెల్‌బోర్న్ టెస్టు.. ఐదు రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది.
మెల్‌బోర్న్ టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. గత రెండు పర్యాయాలు ఈ సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈసారి మాత్రం సిరీస్ చేజిక్కుంచుకునే అవకాశాన్ని కోల్పోయింది. కానీ.. చివరి టెస్టులో గెలిస్తే.. సిరీస్‌ను రిటైన్ చేసుకోవచ్చు. ఐదో టెస్టు సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.