ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త సంవత్సరంలో హోం లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

business |  Suryaa Desk  | Published : Tue, Dec 31, 2024, 10:29 PM

గృహ రుణం: చాలా మంది ఇంటిని సొంతం చేసుకోవాలనుకునే కలను నెరవేర్చుకునేందుకు బ్యాంకు లోన్‌పై ఆధారపడతారు. అయితే వీరు హోం లోన్ దరఖాస్తు చేసే ముందు కొన్ని విషయాల్ని పరిశీలించాల్సి ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా క్రెడిట్ స్కోరు కీలకంగా ఉంటుంది. మీ క్రెడిట్ స్కోరు రుణ దరఖాస్తుపై నేరుగా ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. బ్యాంకులు 700 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు కలిగి ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తాయన్న సంగతి తెలిసిందే. కాబట్టి.. మీ క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును లోన్‌కు దరఖాస్తు చేసే 6 నెలల ముందు నుంచే తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.


సాధారణంగా హోం లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు.. దరఖాస్తుదారుల అకౌంట్ స్టేట్‌మెంట్స్ తీసుకుంటాయి. గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ ఆధారంగా బ్యాంకులు మీ రీపేమెంట్ సామర్థ్యం అంచనా వేస్తాయి. మీ అకౌంట్ సగటు బ్యాలెన్స్ కనీసం హోం లోన్ ఈఎంఐకి సమానంగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.


చాలా మంది హోం లోన్ తీసుకునేటప్పుడు ఇంటి విలువకు సరిపడా మొత్తం లోన్ పొందొచ్చని అనుకుంటుంటారు. కానీ బ్యాంకులు ఇంటి విలువలో కనీసం 10 నుంచి 20 శాతం మొత్తాన్ని డౌన్ పేమెంట్ చెల్లించాలని అడుగుతాయి. మిగతా మొత్తానికి సరిపడా లోన్ అందిస్తాయి. అందుకే.. ఈ డౌన్ పేమెంట్ మొత్తం సమకూర్చుకునేందుకు ముందు నుంచే పొదుపు చేయడం ఉత్తమం.


ఇక రూ. 50 లక్షల హోం లోన్‌ను 20 ఏళ్ల కాల వ్యవధితో ప్రస్తుత 9 శాతం వడ్డీ రేట్ల ప్రకారం చూస్తే ఈఎంఐ దాదాపుగా రూ. 45 వేలు పడుతుంది. అందుకే.. లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు దాదాపుగా ఈ మొత్తాన్ని ఈఎంఐగా చెల్లించేందుకు సిద్ధపడి ఉంటేనే లోన్ కోసం అప్లై చేయాలి. కొన్ని బ్యాంకులు మీ ఇంటి పత్రాల్ని వారి వద్ద డిపాజిట్ చేయమని.. దీని కోసం రిజిస్ట్రేషన్ కూడా చేయించమని కోరుతుంటాయి. దీనినే మొమోరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అంటారు. లోన్ మొత్తంలో ఇది 0.5 శాతం నుంచి 0.60 శాతం వరకు ఉంటుంది.


మరీ ముఖ్యంగా హోం లోన్ తీసుకునే ముందుగా పలు బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు, ఆఫర్లను పోల్చుకోవాలి. దీని కోసం సమగ్ర ఆన్ లైన్ పరిశోధన చేయాలి. బ్యాంకులు కొన్ని పండగ సీజన్లలో ప్రాసెసింగ్ ఛార్జీల్ని మాఫీ చేస్తుంటాయి. ఇంకా వడ్డీ రేట్లపైనా డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. మరోవైపు ఫ్లోటింగ్ లేదా ఫిక్స్‌డ్ రుణాల వడ్డీ రేట్ల గురించి కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. వీటి గురించి ముందుగానే తెలుసుకొని అప్పుడు సరైన లోన్ ప్లాన్ ఎంచుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com