ప్రస్తుతం డిబిట్ కార్డుల కంటే క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. బ్యాంకులు సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండడం, పలు ప్రత్యేక ప్రయోజనాలు ఉండడం వంటి కారణాలతో ఎక్కువ మంది వీటిని తీసుకుంటున్నారు. ఇక షాపింగ్, డైనింగ్, బిల్ పేమెంట్లకు విరవిగా వాడేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంటి అద్దె చెల్లింపులకు సైతం క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారు. నగదు కొరత ఉన్న సందర్భంలో క్రెడిట్ కార్డులు వినియోగించుకోవడం సహజమే. కానీ, కొందరు చేతిలో డబ్బులు ఉన్నా రెంట్ పేమెంట్ ఆప్షన్ వినియోగించుకుంటున్నారు. మరి రెంట్ పేమెంట్ల కోసం క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తే ఎలాంటి లాభనష్టాలు ఉంటాయో తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డుతో రెంట్ పే చేస్తే లాభాలు..
రెంట్ పేమెంట్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డులను బట్టి క్యాష్ బ్యాక్‌లు, ట్రావెల్ పాయింట్లు వంటి రివార్డ్స్ లభిస్తాయి. అయితే, కార్డు, బ్యాంకును బట్టి మారుతుంటాయి. క్రెడిట్ కార్డు ద్వారా పెమెంట్ చేసి ఆ బిల్లు చెల్లించేందుకు 20- 45 రోజుల వరకు గడువు ఉంటుంది. ఎలాంటి వడ్డీ ఉండదు. ఈలోగా తిరిగి చెల్లించేస్తే సరిపోతుంది. ఆ వ్యవధిలో చేతిలో ఉన్న డబ్బులను ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. క్రమంగా క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లిస్తే దీర్ఘకాలంలో మంచి క్రెడిట్ స్కోర్ నిర్మించుకునే అవకాశం ఉంటుంది. చేతిలో డబ్బులు లేని సమయంలో క్రెడిట్ కార్డ్ రెంట్ పేమెంట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీంతో ఇంటి ఓనర్‌కు సకాలంలో రెంట్ ఇచ్చినవారమవుతాం.
ఈ నష్టాలూ ఉంటాయ్..
క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే థర్డ్ పార్టీ యాప్స్ కొంత ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. దీంతో పాటు కొన్ని బ్యాంకులు సైతం రెంట్ పేమెంట్లపై 1 శాతం మేర ఫీ వసూలు చేస్తున్నాయి. ఇది అదనపు భారమేనని చెప్పాలి. ఇక రెంట్ చెల్లించి ఏదైనా కారణంతో సకాలంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే దాదాపు 30-42 శాతం వరకు వడ్డీ పడుతుంది. మరోవైపు క్రెడిట్ స్కోర్ లెక్కించడంలో క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కీలకంగా మారుతుంది. అది 30 శాతం లోపే ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. ఒక వేళ రెంట్ పేమెంట్లతో పెద్ద మొత్తంలో పేమెంట్లు చేస్తే యుటిలైజేషన్ రేషియోపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. సీయూఆర్ రేషియో 30 శాతం మించితే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. అలాగే క్రెడిట్ కార్డు ఉంది కదా అని చేతిలో ఉన్న డబ్బులను ఇతర అవసరాలకు వాడుకుంటుంటారు. దీంతో ఆర్థిక క్రమ శిక్షణ దెబ్బతింటుంది.
క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ చేసేటప్పుడు ఎలాంటి లాభాలు ఉన్నాయి? నష్టాలను మించే రివార్డులు లభిస్తున్నాయా? అనే విషయాలు చూడాలి. మంచి రివార్డులు వస్తాయని అనుకుంటేనే రెంట్ పేమెంట్ చేయడం మంచిది. నగదు లేని సందర్భాల్లో, క్రెడిట్ కార్డ్ టార్గెట్ చేరుకునేందుకు వాడితే ప్రయోజనకరమే. కానీ, డబ్బులు అవసరమైన ప్రతి సారీ క్రెడిట్ కార్డు వాడేస్తే అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చు. క్రెడిట్ కార్డును ఎంతో క్రమశిక్షణగా ఉపయోగించాలి. అప్పుడే ప్రయోజనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.