క్విక్ కామర్స్ రంగం దేశీయంగా ఇటీవలి కాలంలో గణనీయంగా పుంజుకుంటోందని చెప్పొచ్చు. దీనికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. నిమిషాల వ్యవధిలోనే వస్తు్వుల్ని ఇంటి దగ్గరికి తెచ్చిస్తుండటంతో వీటి వినియోగం కూడా రోజురోజుకూ పెరుగుతుందని చెప్పొచ్చు. అదే పండగలు, వేడుకలు సహా ఇతర ప్రత్యేక సందర్భాల్లో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఊహించని దానికి మించి గిరాకీ ఉంటుంది. ఇదే సమయంలో ఇప్పుడు నూతన సంవత్సరం వేళ బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి పలు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు రికార్డు స్థాయిలో విక్రయాల్ని జరిపాయి. వీటి గురించి ఆయా సంస్థలు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపాయి. ఇక 2023 డిసెంబర్ 31తో చూస్తే.. 2024 డిసెంబర్ 31న బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ వేదికగా ఆర్డర్స్ సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి.
అయితే.. క్విక్ కామర్స్ విభాగం పుంజుకుంటున్న తరుణంలోనే ఈ అవకాశాల్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటూ బ్లింకిట్ తాజాగా పెద్ద ఆర్డర్ల కోసం ఫ్లీట్ సేవల్ని లాంఛ్ చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్‌లో ఫ్లీట్ సేవలు తెచ్చినట్లు బ్లింకిట్ సీఈఓ ఆల్బిందర్ దిండ్సా ఎక్స్ వేదికగా చెప్పారు. ఇంకా.. ఇదే సమయంలో న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా.. ఎక్కువగా జనం ఏయే వస్తువుల్ని ఎంత సంఖ్యలో ఆర్డర్ చేశారో దానికి సంబంధించి ట్రెండ్ రిపోర్ట్, డేటాను పోస్ట్ చేశాడు.
ఇక్కడ ప్రధానంగా కండోమ్ సేల్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బ్లింకిట్ ఒక్కటే ఏకంగా 1,22,356 కండోమ్ ప్యాక్స్ డెలివరీ చేసినట్లు వివరించారు. ఇంకా 2.34 లక్షల ఆలూ భుజియా, 45,531 మినరల్ వాటర్ బాటిల్స్ సహా 6834 ఐస్ క్యూబ్స్, 1003 లిప్ స్టిక్స్, 762 లైటర్స్, 2434 ఈనో ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు తెలిపారు. ఇక డిసెంబర్ 31న రాత్రి వేర్వేరు సమయాల్లో ఏ సమయానికి.. ఏ వస్తువు.. ఎన్ని డెలివరీలు అవబోతున్నాయో ట్విట్టర్ వేదికగా వేర్వేరు పోస్టుల్లో తెలిపారు.
కండోమ్ సేల్స్ రికార్డు స్థాయిలో జరగ్గా.. కొందరు ఆయన ట్వీట్ కింద కామెంట్స్ చేశారు. ఎక్కువ మంది ఏ రకమైన, ఏ ఫ్లేవర్ కండోమ్స్ ఆర్డర్ చేశారో చెప్పగలరా? అది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని అడగ్గా.. దానికి కూడా ఆల్బిందర్ రిప్లై ఇచ్చారు. ఆయన ఒక చిత్రం విడుదల చేసి.. దాంట్లో ఏ కండోమ్ ఫ్లేవర్ ఎక్కువగా విక్రయించారో వివరించారు. దీని ప్రకారం.. అత్యధికంగా 39.1 శాతంతో చాకోలేట్ ఫ్లేవర్ తొలి స్థానంలో ఉండగా.. 31 శాతంతో స్ట్రాబెర్రీ, 19.8 శాతంతో బబుల్‌గమ్ ఉన్నాయి. మిగతా వాటి వాటా 10.1 శాతంగా ఉంది.
ఇదే సమయంలో బ్లింకిట్ డిసెంబర్ 31న ఎన్నో రికార్డుల్ని చెరిపేసిందని చెప్పారు. ఒకరోజులో అత్యధిక ఆర్డర్లు సహా నిమిషానికి అత్యధిక ఆర్డర్లు, గంటకు అత్యధిక ఆర్డర్లు, డెలివరీ పార్ట్‌నర్స్‌కు అత్యధిక మొత్తం టిప్స్, ఒక రోజులో ఎక్కువ చిప్స్ అమ్ముడుపోవడం, ఒకరోజులో ఎక్కువ గ్రేప్స్ అమ్ముడుపోవడం వంటి రికార్డులు నమోదయ్యాయని చెప్పారు. డెలివరీ పార్ట్‌నర్‌కు అత్యధికంగా హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి రూ. 2500 టిప్ ఇచ్చారని.. ఇదే హైయెస్ట్ టిప్ అని అన్నారు.