సామాన్యులకు కూడా బీమా ప్రయోజనాలు అందించాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండు జీవిత బీమా పథకాల్ని తీసుకొచ్చింది. అందులోనే ఒకటి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). దీంట్లో ఏటా చిన్న మొత్తంలో మీరు ప్రీమియం చేసినట్లయితే.. రూ. 2 లక్షల ప్రయోజనం పొందొచ్చు. అసలు ఈ స్కీమ్ ఏంటి.. దీనికి ఆదరణ ఎలా ఉంది. ఎలా చేరాలి వంటి వివరాలు తెలుసుకుందాం. ఏదైనా అనుకోని ప్రమాదంతో మరణించినా లేకపోతే వైకల్యం పొందినా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం కోసం కేంద్రం.. 2015లోనే ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఇక్కడ అతి తక్కువ ప్రీమియంతోనే రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. మీకు ఏదైనా బ్యాంకులో లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ (పొదుపు) అకౌంట్ ఉంటే మీరు అర్హులే.
అయితే.. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకాలపై సాధారణ జనాలకు అవగాహన లేక.. చాలా తక్కువ సంఖ్యలోనే లబ్ధి పొందుతున్నారని తెలిసింది. బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉన్న ప్రతి కస్టమర్ నుంచి ఈ పీఎంఎస్‌బీవై కింద కేవలం ప్రతి సంవత్సరానికి రూ. 20 చొప్పున ప్రీమియం తీసుకొని.. రూ. 2 లక్షల విలువైన జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే.. ఇందులో చేరాక.. ఏదైనా ప్రమాదం జరిగి ఆ ఖాతాదారుడు మరణిస్తే సమాచారాన్ని బ్యాంకుకు నామినీ తెలియజేస్తే.. వారికి లైఫ్ ఇన్సూరెన్స్ పరిహారం కింద రూ. 2 లక్షలు వస్తాయి.
గతంలో చాలా బ్యాంకులు ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి కస్టమర్ అకౌంట్ తెరిచే సమయంలోనే దీని గురించి కస్టమర్ నుంచి అంగీకారంతో ఈ పథకంలో చేర్పించాయి. ఒకసారి కస్టమర్ నుంచి లేఖ తీసుకొని.. ఆటో డెబిట్ పేరిట ప్రతి సంవత్సరం ప్రీమియం సొమ్ము మినహాయించుకునేవి. ఈ క్రమంలోనే ఈ బ్యాంకుపై విమర్శలు కూడా వచ్చాయి. తమ సమ్మతి లేకుండానే.. తమకు చెప్పకుండానే డబ్బులు కట్ చేస్తుందని చాలా మంది బ్యాంకు దృష్టికి తీసుకురాగా.. ఎస్బీఐ స్పందించింది కూడా. కస్టమర్ అంగీకారంతోనే తాము ఈ స్కీంలో చేర్పిస్తామని వెల్లడించింది.
ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో.. ఏడాదికోసారి ప్రీమియం సొమ్ము రూ. 20ని తమ అకౌంట్ నుంచి మినహాయించుకోవాలని ఖాతాదారుడు బ్యాంకుకు రాతపూర్వకంగా సంతకం చేసి విజ్ఞప్తి చేయాలి. కొన్ని బ్యాంకులు ఇలా లేఖను ప్రతి సంవత్సరం తీసుకునేలా నిబంధన అమలు చేస్తుంటే.. కొన్ని బ్యాంకులు మాత్రం ఒకసారి లేఖ తీసుకొని అమలు చేస్తున్నాయి. అయితే.. కస్టమర్లు అవగాహన పెంచుకొని ఒకవేళ వారు ఈ స్కీంలో చేరనట్లయితే అప్పుడు బ్యాంకులో ఈ పథకం వివరాలు అడిగి.. క్రమం తప్పకుండా కొనసాగించడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. మరోవైపు.. ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన అనే పథకం కూడా ఉంది. ఇక్కడ ప్రీమియం రూ. 450 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. అందుకని దీంట్లో ఎక్కువ మంది చేరట్లేదు.
18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సున్న వ్యక్తులు.. సురక్షా బీమా యోజనలో చేరొచ్చు. సేవింగ్స్ ఖాతా ఉంటే చాలు. బ్యాంక్ అకౌంట్‌ను కచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. లింక్ చేయకుంటే కేవైసీ చేయించడం తప్పనిసరి. ఏటా జూన్ 1 నుంచి మే 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఏటా జూన్ 1లోగా ప్రీమియం ఆటో డెబిట్‌తో రెనివల్ అవుతుంది. క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే.. రద్దు కోసం బ్యాంకును కోరాలి.