ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్' దేశీయ మార్కెట్లో 'క్రెటా' కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది.దీనిని కంపెనీ త్వరలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనుంది. కాగా అంతకంటే ముందే సంస్థ దీని రేంజ్ వివరాలను వెల్లడించింది.మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త 'హ్యుందాయ్ క్రెటా ఈవీ' (Hyundai Creta EV) 51.4 కిలోవాట్, 42 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందనుంది. 51.4 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ ఛార్జితో 473 కిమీ రేంజ్ అందించగా.. 42 కిలోవాట్ బ్యాటరీ 390 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.హ్యుందాయ్ క్రెటా ఈవీ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మారుతి సుజుకి ఈ విటారా, మహీంద్రా బిఈ 6, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ, టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు ధర ఎంత వుంటుందనేది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ.22 లక్షలు ఉండొచ్చని అంచనా.చూడటానికి కొంత స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. హ్యుందాయ్ క్రెటా ఈవీ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. బ్రాండ్ లోగో వద్ద ఛార్జింగ్ పోర్ట్, కొత్త సైడ్ ప్రొఫైల్, అప్డేటెడ్ రియర్ ఎండ్ వంటివన్నీ ఇందులో గమనించవచ్చు. మొత్తం మీద ఇది మార్కెట్లో దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది.