కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండే పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ లేదా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇందులో వేర్వేరు వర్గాల వారికి ఉపయోగపడేలా వేర్వేరు పథకాలు ఉన్నాయి. వడ్డీ రేట్లు కూడా ఒక్కో దాంట్లో ఒక్కోలా ఉంటాయి. వేటికవే ప్రత్యేకతల్ని కలిగి ఉంటాయి. టెన్యూర్, వడ్డీ రేట్లు, ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయని చెప్పొచ్చు. కొన్నింటిలో దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తే.. కొన్నింట్లో టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ పథకాల వడ్డీ రేట్లను ప్రతి 3 నెలలకు ఓసారి కేంద్ర ప్రభుత్వం సమీక్షించి సవరిస్తుంటుంది. ఈ వడ్డీ రేట్లు తగ్గొచ్చు స్థిరంగా ఉండొచ్చు లేదా పెరగొచ్చు. గత కొంత కాలంగా మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచుతూ వస్తోంది కేంద్రం.
ఇక ఇందులో ఆడపిల్లల కోసం కేంద్రం ఆఫర్ చేస్తున్న అద్భుత పథకం సుకన్య సమృద్ధి అకౌంట్. ప్రస్తుతం పోస్టాఫీస్ పథకాల్లో సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్‌తో కలిపి వడ్డీ రేట్లు దీంట్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కేంద్రం జనవరి- మార్చి త్రైమాసికానికి వడ్డీ రేట్లను ప్రకటించగా.. సుకన్య సమృద్ధి స్కీమ్ వడ్డీ రేటును మార్చలేదు. ప్రస్తుతం దీంట్లో వార్షిక ప్రాతిపదికన 8.20 శాతం వడ్డీ వస్తుంది. ఇతర పథకాలకు కూడా వడ్డీ రేట్లను మార్చలేదు మోదీ సర్కార్. ఇప్పుడు సుకన్య సమృద్ధి స్కీమ్ గురించి తెలుసుకుందాం.
ఇది ఆడపిల్లల కోసమే ఉద్దేశించిన పథకం. వారి పైచదువుల కోసం, పెళ్లి ఖర్చులకు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడం కోసం వారి తల్లిదండ్రులు పెట్టుబడులు పెట్టేందుకు స్కీమ్ తెచ్చింది. పది సంవత్సరాల లోపు ఆడపిల్లల పేరిట ఇందులో అకౌంట్ తెరవొచ్చు. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ ఖాతా తెరవొచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరిట ఖాతా తెరవొచ్చ. ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ ఉంటే మూడో అకౌంట్ కూడా తెరవొచ్చు.
సుకన్య సమృద్ధి వివరాలు..
ఖాతా తెరిచినప్పటి నుంచి వరుసగా 15 సంవత్సరాలు ఇందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బును ఏకకాలంలో లేదా ఇన్‌స్టాల్‌మెంట్లలో కట్టొచ్చు. ఇందులో పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద పాత పన్ను విధానంలో టాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను తగ్గించుకోవచ్చు. పాపకు 18 ఏళ్లు వచ్చిన సమయంలో లేదా పదో తరగతి పాసైన క్రమంలో అకౌంట్లో నుంచి 50 శాతం వరకు డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక పూర్తి మెచ్యూరిటీ అకౌంట్ తెరిచినప్పటి నుంచి 21 ఏళ్లుగా ఉంటుంది. ఇంకా ఆడపిల్లకు 18 ఏళ్ల వయసు వచ్చి పెళ్లి చేసుకుంటే అప్పుడు కూడా అకౌంట్ నుంచి పూర్తి డబ్బులు తీసుకొని ఖాతా క్లోజ్ చేయొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడి..
ఇందులో గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆలోపు ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఉదాహరణకు నెలకు రూ. 10 వేల చొప్పున ఆదా చేసుకుంటే మొత్తం సంవత్సరంలో రూ. 1.20 లక్షలు పెట్టుబడి పెట్టామనుకుందాం. ఇక్కడ మొత్తం 15 ఏళ్లకు పెట్టుబడి రూ. 18 లక్షలు అవుతుంది. అప్పుడు ప్రస్తుత 8.20 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ. 37.42 లక్షలు వస్తాయి. అకౌంట్ తెరిచిన 21 ఏళ్ల తర్వాత చేతికి మొత్తం రూ. 55.42 లక్షలు అందుతాయి. పాప పుట్టిన సమయంలోనే ఇందులో చేర్పిస్తే.. పెళ్లి వయసుకల్లా పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవచ్చు.
ఇదే నెలకు రూ. 5 వేల చొప్పున.. ఏడాదికి రూ. 60 వేల లెక్కన మెచ్యూరిటీకి మెచ్యూరిటీకి మొత్తం రూ. 27,71,031 వస్తుంది. ఇక్కడ పెట్టుబడి రూ. 9 లక్షలుగా ఉంటుంది. అదే ఏటా రూ. 1.50 లక్షలు అనుకుంటే.. అప్పుడు మెచ్యూరిటీకి చేతికి రూ. 69,27,578 (దాదాపు రూ. 70 లక్షలు) వస్తుంది. పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయి. ఇది ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారమే. భవిష్యత్తులో వడ్డీ రేట్లను పెంచితే ఇంకా ఎక్కువే లాభాలు వస్తాయి.