రిస్క్ లేకుండా రిటర్న్స్ సాధించాలంటే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. ఇక్కడ రిస్క్ ఉండదు. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం.. మెచ్యూరిటీకి చేతికి డబ్బులు అందుతాయి. ఇక్కడ వడ్డీ రేట్లే వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకుల్ని బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. టెన్యూర్‌ను బట్టి కూడా ఒక్కో బ్యాంకులో వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటాయి. ఇక్కడ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో చేతికి రిటర్న్స్ అందుతాయన్న సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో పొదుపు ఖాతాల కంటే .. ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనే వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పొచ్చు. అందుకే సంప్రదాయ పెట్టుబడిదారులు ఎక్కువగా వీటిల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
ఇప్పుడు మనం ఎస్బీఐ, అదే విధంగా పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో వడ్డీ రేట్లు దేంట్లో ఎలా ఉన్నాయి.. ఇంకా వడ్డీ రేట్లు దేంట్లో ఎలా.. రిటర్న్స్ ఎంత వస్తాయి వంటి వివరాల్ని తెలుసుకుందాం. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఎస్బీఐ ఏడాది నుంచి ఐదేళ్ల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కనీసం 6.50 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి.
ఈ బ్యాంకులో ఏడాది టెన్యూర్ డిపాజిట్‌పై వడ్డీ రేట్లు 6.8 శాతంగా ఉండగా.. రెండేళ్ల డిపాజిట్‌పై 7 శాతం, మూడేళ్లు, నాలుగేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ అందుతోంది. అదే ఐదేళ్లకు అయితే ఇందులో 6.50 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రూ. 5 లక్షలు డిపాజిట్ చేసిన వారికి ఆయా వడ్డీ రేట్ల ప్రకారం ఎంతొచ్చిందనేది చూద్దాం. ఏడాది డిపాజిట్‌పై 6.8 శాతం చొప్పున చూస్తే .. 5 లక్షలపై వడ్డీ రూ. 34,877 వస్తుంది. రెండేళ్లలో 7 శాతం లెక్కన అయితే రూ. 74,441 వడ్డీ అందుతుంది. 3,4 ఏళ్లలో చూస్తే వరుసగా 6.75 శాతం చొప్పున రూ. 1,11,196, రూ. 1,53,508 వడ్డీ చొప్పున వస్తుంది. ఐదేళ్లలో 6.50 శాతం లెక్కన రూ. 1,90,210 వడ్డీ అందుతుంది.
పోస్టాఫీసుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లుగా పేర్కొంటారు. ఇక్కడ ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల టెన్యూర్‌తో మాత్రమే ఉంటాయి. వీటిల్లో వడ్డీ రేట్లు వరుసగా 6.9 శాతం, 7 శాతం, 7.10 శాతం, 7.50 శాతంగా ఉన్నాయి. ఇక్కడ 5 లక్షలు జమ చేస్తే.. వరుసగా ఏడాదిలో రూ. 35,403; రెండేళ్లలో 74,441; మూడేళ్లలో రూ. 1,17,538; ఐదేళ్లలో రూ. 2,24,974 వస్తుంది. ఎస్బీఐ, పోస్టాఫీసుల్లో పోల్చి చూస్తే.. కేవలం రెండేళ్ల డిపాజిట్‌పైనే ఒకటే వడ్డీ రేటు ఒకటే రిటర్న్స్ వస్తాయి. మిగతా అన్నింటిలోనూ పోస్టాఫీస్ డిపాజిట్లలోనే వడ్డీ అధికంగా వస్తుందని చెప్పొచ్చు.