పీఏ జగదీష్ వివాదంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. తన వద్ద ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్న జగదీష్ గురించి పలు ఆరోపణలు తన దృష్టికి వచ్చాయన్న వంగలపూడి అనిత.. వీటిపై తన పీఏను రెండుసార్లు హెచ్చరించానన్నారు. అయినా కూడా పద్ధతి మార్చుకోకపోవటంతో తీసేశానని అన్నారు. తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని తెలిస్తే.. సొంత పిల్లలను కూడా పక్కన పెడతానని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. విశాఖపట్నం సెంట్రల్ జైలును వంగలపూడి అనిత సందర్శించారు. జైల్లో ఇటీవలి కాలంలో జరుగుతున్న ఘటనలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం సెంట్రల్ జైలులో గంజాయి సరఫరా వార్తలు వచ్చాయన్న వంగలపూడి అనిత.. దీనిపై విచారణ జరిపి కొంతమందిని సస్పెండ్ చేశామన్నారు. ఇక ఖైదీల వద్ద సెల్ ఫోన్లు దొరకడం గురించి కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. దొరికిన సెల్ ఫోన్లు ఎవరివనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని వంగలపూడి అనిత తెలిపారు. కొంతమంది రౌడీ షీటర్లు బయటకు వచ్చి.. మళ్లీ జైలుకు తిరిగి వచ్చే సమయంలో గంజాయిని తీసుకొస్తున్నట్లు మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు సంధు జగదీష్ వంగలపూడి అనిత వద్ద సుమారు పదేళ్లుగా ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్నారు. వంగలపూడి అనిత హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని సంధు జగదీష్ మీద ఆరోపణలు వచ్చాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తనపైనా విమర్శలు వచ్చాయి. వంగలపూడి అనితను కలవడానికి వచ్చేవారిపట్ల ఆయన వ్యవహార శైలిపై టీడీపీ క్యాడర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే తిరుమల శ్రీవారి సిఫార్సు దర్శనాల విషయంలో సంధు జగదీష్ మీద ఆరోపణలు ఉన్నాయి.
వీటితో పాటుగా పేకాట శిబిరాలు నడిపిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. మద్యం దుకాణాల్లోనూ ఆయనకు వాటాలున్నాయంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ వంగలపూడి అనిత సంధు జగదీష్‌పై చర్యలు తీసుకోలేదు. అయితే సంధు జగదీష్ వ్యవహారం ప్రభుత్వ పెద్దల వరకూ చేరడంతోనే సంధు జగదీష్‌ను ప్రైవేట్ పీఏ పదవి నుంచి తప్పించినట్లు తెలిసింది. సంధు జగదీష్‌ను పద్ధతి మార్చుకోవాలని ఒకట్రెండు సార్లు చెప్పానని.. అయినా కూడా తీరు మార్చుకోకపోవటంతో పదవి నుంచి తీసేసినట్లు వంగలపూడి అనిత చెప్తున్నారు.