చాలా మంది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు మెయిల్స్, సందేశాలు వస్తున్నాయి. పాన్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకుంటే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందని ఈ సందేశాల సారాంశం. అలాగే పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవాలంటూ కొన్ని లింకులు సైతం నేరుగా వస్తున్నాయి. ఇలా మీకు కూడా వచ్చిందా? అయితే మీకో హెచ్చరిక. ఇది ఒక స్కామ్. ఇలా పాన్ కార్డు వివరాలు అప్డేట్ చేయాలంటూ లింకులు పంపించి మీ డబ్బులు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ వార్తలను వెరిఫై చేసింది. దీంతో అవి ఫేక్ మెసేజులుగా తేలాయి. పోస్టాఫీసు అలాంటి మెసేజులు పంపించలేదని తేలింది.
ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. 'క్లెయిమ్: పాన్ కార్డ్ అప్డేట్ చేయకుంటే 24 గంటల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఈ లింకుపై క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్: ఈ వార్తల పూర్తిగా ఫేక్. ఇండియా పోస్టాఫీస్ ఎప్పటికీ అలాంటి మెసేజులు పంపించదు. మీ బ్యాంకు వివరాలు, వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు' అని పేర్కొంది.
ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తత..
మోసపూరిత మెయిల్స్, సందేశాలు పెరిగిన నేపథ్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ప్రాక్టీస్ అంశంపై సోషల్ మీడియా వేదికగా పలు సూచనలు చేసింది. తరుచుగా పాస్వర్డ్స్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇంటర్నెట్లో కనిపించే నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను సంప్రదించవద్దని కోరింది. అనుమానస్పద లింకులు కనిపిస్తే వాటిని క్లిక్ చేయొద్దని, పబ్లిక్ వైఫై వినియోగించే విషయంపై అప్రమత్తంగా ఉండాలని కోరింది. బ్యాంకింగ్ కమ్యూనికేషన్ విషయంలో ప్రతిసారి అథెంటిసిటీని వెరిఫై చేసుకోవాలని సూచించింది. ఫిషింగ్ స్కామ్స్ పట్ల అప్రమత్తంగా ఉంటూ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకోవాలని కోరింది. అలాగే అధికారిక బ్యాంకింగ్ యాప్స్ మాత్రమే ఉపయోగించాలని, ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్, యాప్స్ అప్డేట్ చేసుకోవాలని కోరింది. సాధ్యమైనంత వరకు పబ్లిక్ వైఫై వినియోగాన్ని తగ్గించాలని కోరింది.