కోవిడ్-19 పుట్టిల్లు చైనాలో మరో కొత్తరం వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇది మరో మహమ్మారిగా మారుతుందా? అని ప్రపంచం ఆందోళనకు గురవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్ సైతం తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కు కీలక విజ్ఞప్తి చేసింది. చైనాలో వైరస్ వ్యాప్తి, ఆరోగ్య పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన శనివారం జాయింట్ మోనిటిరింగ్ గ్రూప్ సమావేశమైంది. పొరుగు దేశంలో ప్రస్తుత పరిస్థితి.. భారత్‌లో సంసిద్ధతపై చర్చించారు.
ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇంటిగ్రేడెట్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఐసీఎంఆర్, న్యూఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఫ్లూ సీజన్ దృష్ట్యా.. ప్రస్తుత వైరస్ వ్యాప్తి పెరుగుదల అసాధారణం కాదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చైనాలో వైరస్ తీవ్రతకు చలికాలంలో వ్యాప్తిచెందే ఇన్‌ఫ్ల్యూయోంజా వైరస్, ఆర్ఎస్వీ, హ్యూమన్ మెటానిమోవైరస్ వంటి వైరస్‌లు కారణమని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ వైరస్‌లు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నాయి.
‘‘అందుబాటులో ఉన్న అన్ని ఛానెళ్ల ద్వారా చైనాలో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.. చైనాలో పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు పంచుకోవాలని డబ్ల్యూహెచ్ఓను కూడా అభ్యర్థించింది’’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాలో వైర కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతోందని, భారీగా వచ్చే బాధితులతో ఆసుపత్రులు సతమతమవుతున్నాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. హఠాత్తుగా వ్యాప్తికి హ్యూమన్ మెటానిమోవైరస్ కారణమని ప్రచారం జరుగుతోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ.. ‘చైనాలో హెచ్‌ఎంపీపీ వ్యాప్తి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హెచ్‌ఎంపీవీ అనేది సాధారణ శ్వాసకోశ వైరస్.. జలుబు వంటి లక్షణాలు ఉంటాయి.. కొంతమందికి ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల్లో ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి.. కానీ ఇది తీవ్రమైన లేదా ఆందోళన కలిగించే విషయం కాదు’ అని చెప్పారు. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి సాధారణమని చెప్పారు.