మౌలిక సదుపాయాలు కల్పనలో విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, రోడ్లు అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.100 రోజుల్లో 100 రోడ్లు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. 6 నెలల్లో సీసీ, బీటీ రోడ్లు, పలు అభివృద్ధి పనులుచేపడుతున్నట్లు చెప్పారు. సాలూరు నియోజకవర్గంలో ఆగస్టులో గ్రామసభలు, అక్టోబరులో పల్లె పండగలు ఘనంగా చేసి, అందరి ఆమోదంతో ప్రతిపాదించుకున్న రోడ్లను 100 రోజుల్లో పూర్తి చేసి ప్రారంభం చేస్తున్నామని అన్నారు. జనవరి 6వ తేదీన ఒకేసారి 100 రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు.ఈ 100 రోడ్ల ప్రారంభోత్సవం సందర్భంగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు మంత్రి సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన గ్రామాల్లో గిరిజన ప్రజల కోసం రోడ్లు నిర్మించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపనలు చేసిన అనతి కాలంలోనే ప్రారంభోత్సవాలు చేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో అభివృద్ధి, సంక్షేమం అనేది ఎంత చక్కగా జరుగుతుందో మనందరికీ తెలుసునని గుర్తుచేశారు. గత ఐదు సంవత్సరాలుగా జగన్ హయాంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం ముఖ్యంగా పల్లెల్లో వెలుగులు నింపడానికి రహదారి సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.