బీజేపీ నేత రమేష్ బిధూరీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బిధూరీ కల్కాజీ సెగ్మెంట్ నుంచి బీజేపీ తరుఫున పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న రమేష్ బిధూరీ.. కాంగ్రెస్ ముఖ్య నేత, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా చేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. బిహార్ రోడ్లను హేమమాలిని చెంపల్లా నున్నగా చేస్తానని చెప్పి చేయలేకపోయారని రమేష్ బిధూరీ విమర్శించారు. కానీ తాను అలా కాదని.. తనను గెలిపిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా మారుస్తానంటూ బిధూరీ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ప్రియాంక గాంధీని ఉద్దేశించి రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రమేష్ బిధూరీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా రియాక్టైంది. రమేష్ బిధూరీ వ్యాఖ్యలు బీజేపీ మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని తెలియజేస్తానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే విమర్శించారు. బిధూరీ వ్యాఖ్యలు సిగ్గుచేటని.. ప్రియాంక గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రమేష్ బిధూరీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేడా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. బిధూరీ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ విలువలను ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టింది. మహిళల పట్ల బీజేపీకి ఉన్న ఉన్న గౌరవం ఇదేనా అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు.
అయితే తన వ్యాఖ్యలపై విమర్శలు రావటంతో రమేష్ బిధూరీ వివరణ ఇచ్చారు. తనను విమర్శించే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని రమేష్ బిధూరీ అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో హేమమాలిని ఉద్దేశించి ఇలాగే మాట్లాడారని.. మరి హేమమాలినికి ఎందుకు క్షమాపణలు చెప్పలేదన్నారు. సినీ నటిగా హేమమాలిని భారతీయ సినిమాకు వన్నె తెచ్చారన్నారు. మరి హేమమాలిని మహిళ కాదా అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ కంటే హేమమాలిని ఎక్కువ సాధించారని రమేష్ బిధూరీ అభిప్రాయపడ్డారు. మరోవైపు తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న రమేష్ బిధూరీ.. తన వ్యాఖ్యల కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణలు చెప్తున్నానంటూ ట్వీ్ట్ చేశారు. రాజకీయ లాభం కోసం సోషల్ మీడియాలో కొంతమంది తన వ్యాఖ్యలకు తప్పుగా ప్రచారం చేస్తున్నారని రమేష్ బిధూరీ చెప్పుకొచ్చారు.