బంగారం నిల్వలు పెంచుకోవడంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వ్యూహాత్మకంగా ముందుగు సాగుతున్నాయి. ఈ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ దూకుడు ప్రదర్శిస్తోందని చెప్పవచ్చు. 2024 నవంబర్ నెలలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు మొత్తం 53 టన్నుల బంగారం కొంటే.. అందులో ఆర్బీఐ ఒక్కటే 8 టన్నులు (8000 కిలోలు) బంగారం కొనుగోలు చేసింది. దీంతో నవంబర్ నెలలో భారీగా బంగారం కొన్న మూడో అతిపెద్ద కేంద్ర బ్యాంకుగా నిలిచినట్లు ప్రపంచ స్వర్ణ మండలి సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను పరిగణనలోకి తీసుకుని కేంద్ర బ్యాంకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని, రిస్క్ తగ్గించుకునేందుకు బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయని డబ్య్లూజీసీ తెలిపింది. ఈ క్రమంలోనే 2024లో అభివృద్ధి చెందున్న ఆర్థిక వ్యవస్థల కేంద్ర బ్యాంకులు దూకుడుగా ప్రవర్తిస్తున్నాయి. భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయని పేర్కొంది. బంగారానికి డిమాండ్ పెంచడంలో కేంద్ర బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది. నవంబర్ నెలలో 53 టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపింది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో 2024, నవంబర్ నెలలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దానిని కేంద్ర బ్యాంకులు అవకాశంగా మలుచుకున్నాయి. గత ఏడాది నవంబర్ నెల వరకు చూస్తే 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారాన్ని కొన్నది. దీంతో ఆర్బీఐ వద్ద మొత్తం నిల్వలు 876 టన్నులు (8.76 లక్షల కిలోలు)కు చేరింది.
2024లో అత్యధిక బంగారం కొనుగోలు చేసిన దేశాల్లో ఆర్బీఐ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో పోలాండ్ నిలిచింది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ మొత్తం 90 టన్నుల బంగారం కొన్నది. ఆ దేశం నవంబర్ నెలలోనే ఏకంగా 21 టన్నుల బంగారం కొనడం గమనార్హం. దీంతో ఆదేశం వద్ద గోల్డ్ నిల్వలు 448 టన్నులకు చేరాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ 2024లో మొత్తం 11 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. కజకిస్తాన్ 5 టన్నులు, చైనా 5 టన్నులు, జోర్డాన్ 4 టన్నులు కొనుగోలు చేయగా.. తుర్కియే 3 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఇక సింగపూర్ మానిటరీ అథారిటీ 2024లో 7 టన్నుల బంగారం విక్రయించింది. దీంతో ఆ దేశం వద్ద 223 టన్నుల బంగారం ఉంది.