మీరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారా..? మరి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కో బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు వడ్డీ రేట్లు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. సాధారణంగా 50 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు అదనంగా వడ్డీని బ్యాంకులు వీరికి చెల్లిస్తుంటాయి. చాలా బ్యాంకులు దాదాపుగా వడ్డీ రేట్లు దగ్గర్లోనే ఉంటాయి. అయితే 20-30 బేసిస్ పాయింట్ల తేడా ఉన్నా కూడా మీ పెట్టుబడులపై (డిపాజిట్లపై) వడ్డీ పెద్ద మొత్తంలో తేడా రావొచ్చు. కాలం గడుస్తున్న కొద్దీ ఇది గణనీయమైన ప్రభావం చూపుతుంది. అందుకే దేంట్లో ఎక్కువ వడ్డీ వస్తుంది వంటివి కచ్చితంగా తెలుసుకోవాలి.
మనం ఇప్పుడు సీనియర్ సిటిజెన్ల గురించి చూద్దాం. టాప్ బ్యాంకుల్లో ఐదేళ్ల వ్యవధికి వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎలా ఉన్నాయి.. దేంట్లో రూ. 10 లక్షలు జమ చేస్తే.. మెచ్యూరిటీకి ఎంత వస్తుందనేది తెలుసుకుందాం. ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. టాప్ బ్యాంకుల్లో చూస్తే యెస్ బ్యాంకులో (ప్రైవేట్) ఐదేళ్ల ఎఫ్‌డీపై సీనియర్ సిటిజెన్లకు వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. అంటే ఇక్కడ రూ. 10 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీకి చేతికి రూ. 3,98,691 వడ్డీ వస్తుంది. తర్వాత యాక్సిస్ బ్యాంకులో (ప్రైవేట్) 7.75 శాతం వడ్డీ రేటు ఉండగా.. ఇక్కడ 10 లక్షల డిపాజిట్‌పై రూ. 3,86,219 వడ్డీ వస్తుంది.
వీటి తర్వాత ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహా ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐలో ఐదేళ్ల FD పై 7.50 శాతం వడ్డీ రేటు ఉండగా.. 10 లక్షలు జమ చేస్తే.. ఇక్కడ వడ్డీ రూ. 3,73,762 వస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 7.40 శాతం వడ్డీ రేటు ఉంది. దీంతో 10 లక్షలపై ఐదేళ్లలో రూ. 3,68,786 వడ్డీ వస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వడ్డీ రేటు 7 శాతం కాగా.. 10 లక్షలు జమ చేసిన వారికి రూ. 3,48,839 వస్తుంది. ఇక్కడ స్వల్ప వడ్డీ రేటు తేడాతో ఎన్ని వేల వడ్డీ వ్యత్యాసం ఉందో గమనించొచ్చు.
అయితే ప్రభుత్వ, ప్రైవేట్ టాప్ బ్యాంకులతో పోలిస్తే.. ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు. వీటిల్లో గరిష్టంగా 9.50 శాతం వరకు వడ్డీ కూడా వస్తోంది.