మనకు పెట్టుబడులు పెట్టేందుకు చాలానే పథకాలు ఉన్నాయి. వీటిల్లో పోస్టాఫీస్ స్కీమ్స్ లేదా చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మంచి ఆదరణ ఉంటుంది. వీటిల్లో గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. కేంద్రం మద్దతు ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం.. నిర్ణీత కాలానికి మంచి రాబడి వస్తుంది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, ఫిక్స్‌డ్ టర్మ్ ఇలా ఎన్నో పథకాలు ఉంటాయి. ఎవరి పరిస్థితులు,, ఎవరి స్థోమతను బట్టి పథకాల్లో చేరొచ్చు. ఆడపిల్లల కోసం, చిన్న పిల్లల కోసం, ఉద్యోగుల కోసం, సీనియర్ సిటిజెన్స్ కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించే పథకాలు ఇలా చాలానే ఉంటాయి. ఇంకా వీటిల్లో టాక్స్ బెనిఫిట్స్ అందించే పథకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం సీనియర్ సిటిజెన్ల కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం.
ఇదే సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్. ఇది కేవలం సీనియర్ సిటిజెన్ల కోసమే ఉద్దేశించిన పథకం. 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. ఇంకా రిటైర్డ్ సివిలియన్ ఎంప్లాయీస్ అయితే 55 దాటితే చాలు. రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు అయితే 50 దాటితే చాలు ఇందులో చేరొచ్చు. పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేట్లు దాదాపు ప్రతి 3 నెలలకు ఓసారి మారతాయి (తగ్గొచ్చు లేదా పెరగొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు). ప్రస్తుతం జనవరి- మార్చి సమయానికి దీంట్లో వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది.
కనీసం రూ. 1000 లేదా గరిష్టంగా రూ. 30 లక్షలు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టే స్కీమ్. ఇందులో ఇండివిడ్యువల్‌గా ఒక్కరు చేరొచ్చు లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. జాయింట్ అకౌంట్ అయినా గరిష్టంగా రూ. 30 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో పెట్టుబడులపై కూడా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది పాత పన్ను విధానంలోనే వర్తిస్తుంది.
మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. ఇక దీంట్లో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్ల పాటు ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ అందుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత మీరు కట్టిన అసలు మొత్తం కూడా తీసుకోవచ్చు. అవసరం అయితే మరో మూడేళ్లు అకౌంట్ పొడిగించుకోవచ్చు.
ఉదాహరణకు ఇందులో గరిష్ట పెట్టుబడి అయిన రూ. 30 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే.. ప్రస్తుత 8.20 శాతం వడ్డీ రేటు ప్రకారం.. ప్రతి 3 నెలలకు ఓసారి చేతికి రూ. 61,500 వస్తాయి. అంటే ప్రతి నెలా రూ. 20,500 వస్తుందని చెప్పొచ్చు. ఇక సంవత్సరానికి రూ. 2.46 లక్షలు వస్తుంది. ఇది పింఛన్ మాదిరే వస్తుందనుకోవచ్చు. అప్పుడు స్థిర ఆదాయం ఉంటుంది. ఇబ్బందులు ఉండవు. ఇక మెచ్యూరిటీకి ఐదేళ్లలో మీ పెట్టుబడి రూ. 30 లక్షలపై వడ్డీతోనే రూ. 12.30 లక్షలు వస్తుంది. మొత్తం చేతికి రూ. 42.30 లక్షలు వస్తుందని చెప్పొచ్చు. అదే రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. వడ్డీతో రూ. 6.15 లక్షలు వస్తుంది. ఇక్కడ ప్రతి 3 నెలలకు ఓసారి రూ. 30,750 వస్తుంది. ఒకవేళ రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే వడ్డీ రూపంలోనే రూ. 4.10 లక్షలు అందుకోవచ్చు.