తన భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి.. బిచ్చగాడితో ఓ మహిళ ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భర్త ఫిర్యాదుతో బిచ్చగాడిపై కిడ్నాప్ కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. హర్దోయ్ జిల్లా సవాజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్పల్పూర్ గ్రామానికి చెందిన రాజు (45), రాజేశ్వరి (40) దంపతులు. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు.
జనవరి 3న కూరగాయలు కొనుగోలుచేయడానికి మార్కెట్‌కు వెళ్తానని చెప్పి.. ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మధ్యాహ్నం అనగా వెళ్లిన ఆమె.. రాత్రి పొద్దుపోయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమెకోసం చుట్టుపక్కలా గాలించారు. మార్కెట్‌కు వెళ్లి వెతికారు. ఆమె మొబైల్ ఫోన్‌కు కాల్ చేయడానికి ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజు.. పొరుగూరు నుంచి బిచ్చమొత్తుకోడానికి వచ్చే నాన్హే పండిట్ (45) అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశాడు.
అప్పుడప్పుడు తమ గ్రామానికి వచ్చే బిచ్చగాడు నాన్హే.. తన భార్యతో మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడని ఆరోపించాడు. తర్వాత ఆమెను మాయచేసి వలలో వేసుకున్నాడని తెలిపారు. తరుచూ ఇరువురూ ఫోన్‌లో మాట్లాడుకునేవారని చెప్పాడు. ‘‘జనవరి 3న మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూరగాయలు, బట్టలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లి వస్తానని మా కుమార్తె కుష్బూకు నా భార్య రాజేశ్వరి చెప్పింది.. బయటకు వెళ్లిన ఆమమె తిరిగిరాలేదు.. ఎక్కడ ఉంది? ఏమైందోనని వెతికాను.. అయినా ఆచూకీ దొరకలేదు.. ఇంట్లోని గేదెను అమ్మగా వచ్చిన డబ్బును తీసుకెళ్లింది..
ఆమెను పక్క గ్రామానికి చెందిన బిచ్చగాడు నాన్హే పండిట్ కిడ్నాప్ చేసి ఉంటాడు’’ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భర్త ఫిర్యాదు ఆధారంగా భారత న్యాయ సంహితలోని సెక్షన్ 87 ప్రకారం కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చేపట్టామని, మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నాయని పేర్కొన్నారు.