ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈక్విటీల్లో హైరిటర్న్స్ వస్తున్నాయనే ప్రచారం, సులభంగా పెట్టుబడి పెట్టగలగడం వంటి చాలా కారణాలు మ్యూచువల్ ఫండ్స్ వైపు ఇన్వెస్టర్లు చూసేలా చేస్తున్నాయి. అయితే, అన్ని వేళలా హైరిటర్న్స్ వస్తాయని అనుకుంటే పొరపాటే. చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. మార్కెట్లు పడిపోతే భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. అలా చాలా స్కీమ్ ఈ 2025 కొత్త ఏడాది ప్రారంభంలో ఇన్వెస్టర్లను ముంచేశాయి.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈ జనవరి తొలి వారంలో దాదాపు 7 శాతం మేర నష్టాలు చవిచూశాయి. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్ 50 సూచీ, బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ వరుసగా 0.78 శాతం, 0.75 శాతం మేర నష్టపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో పలు మ్యూచువల్ ఫండ్స్ ఒక్క వారంలోనే 4.50 శాతం నుంచి 7 శాతం వరకు నష్టపోయాయి. అందులో ప్రధాన అసెట్ మేనెజ్మెంట్ కంపెనీల పథకాలు ఉన్నాయి. జనవరి 10వ తేదీతో ముగిసిన చివరి వారంలోని గణాంకాలు చూసుకుంటే శ్రీరామ్ మల్టీ సెక్టార్ రొటేషన్ ఫండ్ అత్యధికంగా నష్టపోయింది. గత వారంలో 6.58 శాతం మేర నష్టాలు మిగిల్చింది.
హెచ్ఎస్‌బీసీ మిడ్ క్యాప్ ఫండ్ గత వారం ఏకంగా 5.90 శాతం మేర పడిపోయింది.
యాక్సిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్ అనే ఇంటర్నేషనల్ ఫండ్ గత వారం 5.03 శాతం మేర నష్టపోయింది.
మీరే అసెట్ గ్లోబల్ ఎలక్ట్రానిక్ అండ్ ఆటోనమస్ వెహికల్స్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ 4.86 శాతం మేర పడిపోయింది.
మోతీలాల్ ఓశ్వాల్ బిజినెస్ సైకిల్ ఫండ్ గత వారంలో 4.86 శాతం తగ్గింది.
హెచ్ఎస్‌బీసీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 4.85 శాతం మేర నష్టపోయింది.
మోతీలాల్ ఓశ్వాల్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్ అనే థెమాటిక్ ఫండ్ 4.84 శాతం మేర నష్టాలు మిగిల్చింది.
ఎడెల్వైసిస్ బిజినెస్ సైకిల్ ఫండ్, ఎడెల్వైసిస్ యూఎస్ టెక్నాలజీ ఈక్వీటీ ఫండ్ ఆఫ్ ఫండ్ వరుసగా 4.81 శాతం, 4.66 శాతం మేర నష్టపోయాయి.
యూనియన్ యాక్టివ్ మూమెంటమ్ ఫండ్ గత వారంలో 4.58 శాతం మేర పడిపోయింది.
ఇక జనవరి తొలి వారంలో కొన్ని స్కీమ్స్ లాభాలను అందుకున్నాయి. అందులో 11 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 0.06 శాతం నుంచి 3.47 శాతం మేర లాభాలను అందించాయి.