దేశీయ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి మార్కెట్లపై ఆసక్తి పెరుగుతున్న క్రమంలో వివిద రంగాల్లోని సంస్థలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది 2025లోనూ ఐపీఓల సందడి కొనసాగనుంది. ఈ క్రమంలోనే కోటక్ మహీంద్రా క్యాపిటల్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ సంవత్సరం ఐపీఓల ద్వారా 35 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3 లక్షల కోట్లు సమీకరించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్లు అంచనా వేసింది. 2024లో వచ్చిన ఐపీఓలు మొత్తం 22 బిలియన్ డాలర్లు అంటే రూ.1.8 లక్షల కోట్లతో పోలిస్తే దాదాపు రెండితలవుతుందని పేర్కొంది.
2025లో ఆర్థిక సేవల రంగంలో అత్యధికంగా 9 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.76,500 కోట్లు సమీకరించే ఐపీఓలు ఉండనున్నాయని నివేదిక తెలిపింది. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. ఇక ఈకామ్ ఎక్స్‌ప్రెస్, పెప్పర్ ఫ్రై, జెప్టో వంటి కంపెనీ 5 బిలియన్ డాలర్లు అంటే రూ.42,500 కోట్లు సమీకరించే అవకాశం ఉందని తెలిపింది. కంపెనీల ఐపీఓల పరిమాణాలు స్థిరంగా పెరుగుతున్నట్లు తెలిపింది. భవిష్యత్తు పెట్టుబడుల కోసం ఐపీఓలకు వెళ్లాలని భావిస్తున్న కంపెనీలు పెరుగుతున్నట్లు కోటక్ క్యాపిటల్ నివేదిక పేర్కొంది. 2024లో 91 ఐపీఓలు వచ్చాయి. వాటి సగటు లిస్టింగ్ గెయిన్స్ 32.8 శాతంగా ఉన్నట్లు కోటక్ క్యాపిటల్ పేర్కొంది. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడుల కోసం ఐపీఓలపై ఆధారాపడుతున్నరని, సెకండరీ మార్కెట్లో కంటే వీటివైపే మొగ్గు చూపుతున్నారని పేర్కొంది.
జనవరి 13 నుంచి లక్ష్మీ డెంటల్ ఐపీఓ..
ఈ కొత్త ఏడాది రెండో వారంలోనే మరో ప్రముఖ ఐపీఓ అందుబాటులోకి వస్తోంది. అదే లక్ష్మీ డెంటల్ ఐపీఓ. జనవరి 13వ తేదీ నుంచి ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. అంతకు ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 314 కోట్లు సమీకరించింది. 31 కంపెనీలకు ఒక్కో షేరు రూ. 428 చొప్పున 73.99 లక్షల షేర్లు విక్రయించింది. జనవరి 15వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్ కొనసాగనుంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 407- 428 గా ఉంది. తాజా ఈక్విటీ షేర్ల జారీతో రూ. 138 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 1.31 కోట్ల షేర్లు విక్రయించనున్నారు. దీని ద్వారా రూ.560 కోట్లు సమీకరించనుంది.