ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగే జట్లను ఇప్పటికే ఆయా క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. జనవరి 12 నాటికే ప్రాబబుల్స్ జట్లను ప్రకటించాల్సి ఉంది. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటి వరకు భారత జట్టును ప్రకటించలేదు. ఇప్పటికే ఈ విషయమై బీసీసీఐ.. ఐసీసీ నుంచి స్పెషల్ పర్మీషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
జనవరి 19లోగా భారత జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ల ఫిట్‌నెస్ టెస్ట్‌ల రిపోర్ట్‌ల కోసమే వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును అంచనా వేసాడు. ఆశ్చర్యకరంగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలకు అవకాశం దక్కదని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా టీమిండియా ఎంపిక గురించి మాట్లాడిన భజ్జీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నా అభిప్రాయం ప్రకారం వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ లేదా రిషభ్ పంత్‌ల్లో ఒకరిని తీసుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం సంజూ శాంసన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే సౌతాఫ్రికాలో అతనే మెరుగ్గా రాణించాడు. రిషభ్ పంత్ కూడా ఆస్ట్రేలియాలో రాణించాడు. కానీ అది సుదీర్ఘ పర్యటన. కాబట్టి అతనికి విశ్రాంతి ఇచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
కుల్దీప్‌కు చోటివ్వాలి..
రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించాలి. స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎంచుకోవాలి. కుల్దీప్ యాదవ్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యాతో పాటు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవాలి. టీ20ల్లో వరుసగా రెండు శతకాలు బాదిన తిలక్ వర్మకు కూడా అవకాశం ఇవ్వాలి. పేసర్లుగా మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లను తీసుకోవాలి. బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఎలాగూ ఉంటారు. ఆసీస్ పర్యటనలో రాణించిన యశస్వి జైస్వాల్‌కు కూడా అవకాశం ఇవ్వాలి.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
హర్భజన్ సింగ్ ఎంపిక చేసిన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రిషభ్ పంత్/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.