ప్రతి ఒక్కరి అందంలో కురులు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మహిళలు. ప్రతి మహిళ అందమైన, నలుపు, మందపాటి జుట్టును కోరుకుంటుంది. అయితే, బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టు మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. జుట్టు రాలిపోవడం, చుండ్రు, దురద, పల్చని వెంటుక్రలు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక, చాలా మంది మహిళలు ఇంటి చిట్కాల నుంచి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినా, జుట్టు పెరగక ఇబ్బందులు పడుతున్నారు.
మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్‌లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును బలహీనపరుస్తాయి. జుట్టు నిర్జీవంగా మారుతుంది. దీంతో జుట్టు రాలిపోతుంది. అందుకే వెంట్రుకలు బాగా పెరగడం కోసం సహజ పద్ధతుల్నే ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. ఇక, జుట్టు ఆరోగ్యంలో కొబ్బరి నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను బాగా అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అయితే, వంటింట్లో దొరికే రెండు పదార్థాలతో మిక్స్ చేసి మరిగించి అప్లై చేస్తే ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది హెయిర్ ఫాల్‌ని ఆపి.. జుట్టును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
జుట్టు పెరుగుదలకు కొబ్బరి నూనె
జుట్టు సంరక్షణ కోసం కొబ్బరి నూనెను ఎప్పట్నుంచో వాడుతున్నారు. కొబ్బరి నూనెతో జుట్టుకు తగిన సంరక్షణ అందుతుంది. కొబ్బరి నూనె జుట్టును తేమగా ఉంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో పాటు హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలను కొబ్బరి నూనె ప్రోత్సాహిస్తుంది. కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. కొబ్బరినూనెలో నిగెల్లా విత్తనాలు (కలోంజి), మెంతుల్ని కలిపి జుట్టుకు రాస్తే జుట్టు పెరుగుదల అనేక రెట్లు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని సన్నని మంట మీద పెట్టాలి. ఇప్పుడు ఒక చెంచా కలోంజి గింజలు, ఒక చెంచా మెంతి గింజలు వేసి బాగా ఉడికించాలి. నూనె ఉడికిన తర్వాత, రంగు మారినప్పుడు, మంటను ఆపివేయండి. ఈ నూనెను వడగట్టి సీసాలో తీసుకోండి. ఆ తర్వాత వాడాలనుకున్నప్పుడు నూనెను కొద్దిగా వేడి చేసి జుట్టు యొక్క మూలాల నుంచి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయండి. ఆ తర్వాత గంట సేపు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. ఈ నూనెను వారానికి రెండు సార్లు వాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ప్రయోజనాలు
* ఈ మిశ్రమంలో ఉండే కలోంజి గింజల్ని నిగెల్లా సీడ్స్ అంటారు. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తాయి. కలోంజి గింజలు జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టును మెరిసేలా చేయడానికి ఉపయోగిస్తారు.
* మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు తగిన పోషణనిచ్చి.. హెయిర్ ఫాల్‌ని అరికడుతుంది. ఇక, కొబ్బరి నూనె గురించి తెలిసిందే. ఈ మూడింటి కాంబినేషన్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. చలికాలంలో ఈ రెమెడీ బెస్ట్ ఆప్షన్.
* జుట్టు రాలడాన్ని ఆపి.. బాగా పెరిగేలా చేస్తుంది ఈ మిశ్రమ నూనె. అంతేకాకుండా జుట్టుకు తగిన మెరుపుని ఇస్తుంది.
వీటిని కూడా ట్రై చేయండి
* జుట్టు పెరగాలంటే ఎగ్ హెయిర్ మాస్క్ తయారు చేసి వారానికోసారి అప్లై చేసుకోవచ్చు. ఎగ్ హెయిర్ మాస్క్ జుట్టుకు పుష్కలంగా ప్రొటీన్లను అందిస్తుంది.
* ఉసిరి రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఉసిరికాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
* ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టుకు మేలు చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదల చాలా రెట్లు మెరుగుపడుతుంది.
మెంతుల పేస్ట్
వెంట్రుకలు పెరగడానికి, మెంతి గింజల పేస్ట్ కూడా జుట్టుకు రాసుకోవచ్చు. ఇందుకోసం అరకప్పు మెంతి గింజలను రాత్రి నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, ఈ గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసి తలకు పట్టించి అరగంట తర్వాత కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకసారి అప్లై చేసుకోవచ్చు.